Wednesday, November 20, 2024

ఇక విద్యాసంవత్సరం ప్రారంభంలోనే.. ప్రభుత్వ బడిపిల్లలకు యూనిఫాంలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సర్కారు బడుల్లో చదివే 25 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. అయితే ఇవి విద్యార్థులకు సమయానికి అందడంలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు పున:ప్రారంభమైనప్పుడు పంపిణీ చేయవలసిన స్కూల్‌ యూనిఫాంలు బడులు తెరిచిన రెండు నెలలకోసారి, విద్యా సంవత్సరం మధ్యలో మరోసారి అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులు రెండు నెలలు యూనిఫాంలు లేకుండా పాఠశాలలకు హాజరవుతుంటే మరికొందరేమో చిరిగిన లేదా పాత యూనిఫాంతోనే పాఠశాలలకు హాజరువుతున్న పరిస్థితి ఉంది.

బడులు తెరిచిన తర్వాత ఒక జత, విద్యా సంవత్సరం మధ్యలో మరో జత యూనిఫాం ఇస్తుండటంతో ముందస్తుగా ఇచ్చిన ఒక జతనే ప్రతీ రోజూ వేసుకొనిరాలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం సమయంలోనే స్కూల్‌ యూనిఫాంలు పంపిణీ చేయనుంది. ఒక జత ఒకసారి ఇంకోక జత మరోసారి ఇవ్వకుండా ఒకేసారి రెండేసి జతలను స్కూళ్లు ప్రారంభంలోనే ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన చర్యలను ఇప్పటి నుంచే విద్యాశాఖ చేపట్టింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో దుస్తులను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో జూలైలో ఒక జత, రెండో జతను ఆగస్టు 15 నాటికి పంపిణీ చేస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు.

- Advertisement -

అయితే ప్రస్తుతం కొన్ని జిల్లాల్లోని విద్యార్థలకు మాత్రమే రెండేసి జతలు అందితే కొన్ని చోట్ల ఇంకా చాలా మందికి రెండు జతల యూనిఫాంలు అందలేదని తెలుస్తోంది. ఇకమీదట ఇలా కాకుండా బడులు ప్రారంభానికి ముందే యూనిఫాంలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున యూనిఫాంలను అందజేయనున్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ బడులు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఒకే రూపంలో ఉన్న యూనిఫాంలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.

రూ.121 కోట్లతో దుస్తుల తయారీ: విద్యాశాఖ మంత్రి సబిత

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప(యూనిఫాం) దుస్తులను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య సంచాలకులు కార్యాలయంలో ఏక రూప దుస్తులు, మన ఊరు-మన బడిపై విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 121 కోట్లతో స్కూల్‌ యూనిఫాంలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా వారి మధ్య తారతమ్య బేధాలు లేకుండా ఉంటాయన్నారు.

వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి దశలో చేపట్టిన 1200 పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వీటిలో సీసీ కెమెరాలు, ఫర్నీచర్‌, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబర్‌ 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మిగతా పాఠశాలల్లోనూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement