Tuesday, November 19, 2024

బీఆర్‌ఎస్ ప్రారంభంలోనే కుటుంబంలో ప్రకంపనలు.. పేరు మారినంత మాత్రాన బుద్ది మారదు : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగ, కుటుంబ పాలన విషయంలో ఎలాంటి మార్పు ఉండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కుటుంబంలో సభ్యులు పెరిగినందున యాజమాన్య హక్కులు కల్పించడానికి , ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా విస్తరించడానికి బీఆర్ఎస్ పెట్టారని ఎద్దేవా చేశారు. పాస్టిక్ సర్జరీ చేయించుకున్నంత మాత్రాన కేసీఆర్ డీఎన్‌ఏ మారదన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వార్ రూంపై దాడి, ఐదుగురు సిబ్బంది అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అయితే అరెస్ట్ అయిన సునిల్ కనుగోలు కార్యాలయ సిబ్బందికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి విడుదల చేస్తున్నట్లు ఉత్తమ కుమారరెడ్డికి స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పడంతో బీఆర్ఎస్ కార్యాలయం ముట్టడి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అనంతరం ఏఐసీసీ నేత పవన్ ఖేరాతో కలిసి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రారంభంలోనే కుటుంబంలో ప్రకంపనలు సృష్టించిందని అన్నారు.

కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి తనకు కావాలని కేసీఆర్‌ని అడుగుతున్నారని, కూతురికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కొడుకుని దూరం పెట్టినట్లుగా చర్చలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. పక్క రాష్ట్రాల్లో ఓడిపోయి ఖాళీగా ఉన్నారు కాబట్టే అఖిలేష్ యాదవ్, కుమారస్వామి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారని ఎద్దేవా చేశారు. వారు ప్రారంభోత్సవానికి హాజరైనంత మాత్రాన బీఆర్ఎస్‌లో భాగస్వాములు అయినట్లు కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే కేసీఆర్‌పై ఉన్న భ్రమలు వారికి తొలగిపోతాయని అన్నారు. తెలంగాణలో లిక్కర్ ఆదాయాన్ని 36 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దన్న రేవంత్, అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో ఉన్న వారితో, అవినీతిపరులతో కుమార స్వామి, అఖిలేష్ చేతులు కలపవద్దని హితవు పలికారు.

తెలంగాణలో మీడియాను కేసీఆర్ కొనుగోలు చేయడంతో తాము సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేశారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఉపేక్షించదని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లోను కాంగ్రెస్ వార్ రూమ్ దాడి అంశాన్ని లెవనెత్తుతామని తెలిపారు. అనంతరం పవన్ ఖేరా మాట్లాడుతూ మోడీ సలహాతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్ వీఆర్‌ఎస్ తీసుకుంటుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ పోలీసులు గుండాల్లా కాంగ్రెస్ వార్ రూంపై దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement