Friday, November 22, 2024

అధికార పార్టీలో కుమ్ములాట‌లు.. బ‌స్తీమే స‌వాల్ అంటున్న అస్మ‌దీయులు !

ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతల మధ్య వార్‌ కొనసాగుతోంది.. నువ్వెంత అంటే నువ్వెంతా అని వాదులాడుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టికెట్టు కోసం ప్రతి నియోజకవర్గంలో పోటీ నెలకొంది.. సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పిస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ ప్రకటించినా ఆశావాహుల్లో మాత్రం ఇంకా ఆశలు నెలకొన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది.. రెండు వర్గాలు గొడవలు పడుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్‌ …తాండూరు నియోజకవర్గంలో గొడవలు బహిర్గతమైయ్యాయి. మేడ్చల్‌లో ఆత్మీయ సమ్మేళనం సాక్షిగా గొడవ జరగ్గా.. తాండూరులో దేవాలయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది.. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాలపై పార్టీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఐనా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
– ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. తమకే టికెట్టు వస్తుందని సిట్టింగ్‌లు.. సిట్టింగ్‌లను మార్పు చేస్తారని మరో వర్గం ఆశతో ఉంది. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో భారాస ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇతర పార్టీలకు ప్రాతినిథ్యం లేకుండాపోయింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు, మహేశ్వరం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల మినహా అన్నింటిని భారాస కైవసం చేసుకుంది. మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించినా ఏడాది తరువాత ఆ ముగ్గురూ భారాసలో చేరిపోయారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్షాలకు ప్రాతినిథ్యం లేకుండాపోయింది. కొత్త వాళ్లు.. పాత వాళ్లలో ప్రస్తుతం పార్టీ నిండుకుండలా మారిపోయింది. దీంతో టికెట్టు కోసం పోటీపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరి ముగ్గురు టికెట్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరి వారే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అవకాశం దొరికినప్పుడల్లా బల ప్రదర్శనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల మినహా మెజార్టీ నియోజకవర్గాల్లో భారాస రెండుగా చీలిపోయింది. ఒక వర్గం సిట్టింగ్‌లకు అనుకూలంగా ఉండగా మరో వర్గం టికెట్టు కోసం పోటీపడుతున్న వారికి అనుకూలంగా మారింది. వచ్చే ఎన్నికలను భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మూడవసారి అధికారంలోకి వచ్చి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేతల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు.

తాండూరులో రెండు గ్రూపులు…
తాండూరు నియోజకవర్గంలో భారాస పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మరో వర్గానికి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రతిసారి రెండు వర్గాలు గొడవలు పడటం పరిపాటిగా మారింది. ఎమ్మెల్యే…ఎమ్మెల్సీలు ఇద్దరు పాల్గొనే సమావేశాల్లో గొడవలు జరగడం పక్కాగా మారింది. వీరిద్దరు హాజరయ్యే సమావేశాలకు పోలీసులకు అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గొడవలు పడటం పోలీసులు రెండు వర్గాలను సముదాయించి పంపించడం మామూలైపోయింది. తాజాగా బద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రెండు వర్గాలు గొడవ పడ్డాయి. హారతి ఇచ్చే సమయంలో గొడవ జరిగింది. వాస్తవానికి తాండూరు ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాల్లో హారతి ఇవ్వాల్సిఉంటుంది. ఇది ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పైలెట్‌ ఎమ్మెల్యేగా ఉన్నందునా ఆయనే హారతి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనిని ఎమ్మెల్సీ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది మూడురోజుల క్రితం జరిగినా తాజాగా వీడియో వైరల్‌గా మారింది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ- ఎమ్మెల్యేలమధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నువ్వా నేనా అంటూ వాదులాడుకుంటున్నారు.టికెట్టు విషయంలో వీరిద్దరి ధీమాతో ఉన్నారు.

- Advertisement -

మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి…
మేడ్చల్‌ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య వార్‌ కొనసాగుతోంది. తాజాగా ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్‌చార్జీ ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్‌రెడ్డి సాక్షిగా వీరిద్దరు గొడవపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో నేతలు, కార్యకర్తల మధ్య ఏమైనా మనస్పర్దలుంటే దూరం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని విషయాలపై చర్చించి చిన్నచిన్న సమస్యలుంటే దూరం చేసుకోవల్సి ఉంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఆత్మీయ సమ్మేళనాలు గొడవలకు కేంద్రంగా మారుతున్నాయి. మేడ్చల్‌ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య చాలాకాలంగా గొడవలున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతిలోని మైకును మంత్రి మల్లారెడ్డి లాక్కోవడం వివాదానికి కారణమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement