చండీగఢ్ : హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది.
మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసు బృందాలు మోహరించాయి..
పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న భాజపా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అదంత సులభం కాదు. దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతతోపాటు కుల సమీకరణాలు ఆ పార్టీకి ఈసారి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హరియాణా ఎన్నికల ముఖచిత్రం
మొత్తం నియోజకవర్గాలు 90బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1,031వారిలో మహిళలు 101స్వతంత్ర అభ్యర్థులు 464రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,54,350వారిలో పురుషులు 1,07,75,957మహిళలు 95,77,926ట్రాన్స్‌జెండర్లు 467పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,632
తొలి సారి ఓటు హక్కును వినియోగించుకున్న మనూభాకర్
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత షూటర్ మనూభాకర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా అని చెప్పారు.భారత పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు అని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనూభాకర్ పిలుపునిచ్చారు. అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ మంచి అనుకుంటే వాళ్లకే ఓటు వేయాలని సూచించారు