అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం టీఎంసీ పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం ప్రజలు టిఎంసిని పశ్చిమ బెంగాల్ ‘ప్రాంతీయ పార్టీ’గా పరిగణిస్తున్నారని, తమ పార్టీగా అంగీకరించడం లేదని ఆయన అన్నారు.
అంతేకాదు, అస్సాంలో టీఎంసీకి ఆమోదయోగ్యంగా ఉండేందుకు ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పలు సూచనలు చేశానని గుర్తు చేశారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి రాసిన లేఖలో రిపున్ బోరా స్పష్టం చేశారు.
తాను రెండేళ్లకు పైగా అసోం టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని, ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా సంభాషించానని చెప్పారు. దురదృష్టవశాత్తూ అనేక అంశాల పెండింగ్ నేపథ్యంలో అసోంలోని చాలా మంది ప్రజలు TMCని పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీగా చూడడానికి దారితీశాయన్నారు. ఈ క్రమంలో అసోం ప్రజలు వేరే రాష్ట్రానికి చెందిన పార్టీని అంగీకరించడానికి ఇష్టపడటం లేదన్నారు. అనేక సవాళ్లకు తగిన పరిష్కారం లేకపోవడంతో తాను ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.