గువహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ప్రధాని అమిత్ షా…’ అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై నెట్జన్లు ఆయనను ఓ ఆట ఆడుకుంటున్నారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. నిజానికిది ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నది కాదనీ, ఎదో నోరు జారి వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకులు చెప్పినా ఆ వివాదం సద్దుమణగలేదు. కమలనాథులు కొత్త ప్రధానిని అప్పుడే ఎంపిక చేశారని అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
బీజేపీపై పోరాడేందుకు అంశాలేవీ లేక కాంగ్రెస్ నాయకులు ఈ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రూపం గోస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాంలో కాంగ్రెస్కు స్థానమంటూ లేకుండా పోయింది. దీంతో దీనినొక పెద్ద వివాదంగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. ఇలాంటి పొరపాట్లు అందరికీ జరుగుతూనే ఉంటాయి అని ఆమె అన్నారు. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో బిశ్వ శర్మా… ప్రధాని అమిత్ షా… హోమ్ మంత్రి మోడీ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఈ వీడియోను సంపాదించిన కాంగ్రెస్ నాయకులు దానిపై పెద్ద రాద్ధాంతమే చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..