Sunday, November 24, 2024

Delhi | టికెట్ల కోసం హస్తినలో పైరవీలు.. రాజధానిలో మకాం వేసిన ఆశావహులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులు హస్తినబాట పట్టారు. అధిష్టానం పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. తమకు టికెట్ కేటాయించాలంటూ బయోడేటాలు పట్టుకుని కొందరు తిరుగుతుంటే, తమ పేరు ఢిల్లీ స్థాయిలో పరిశీలనలో ఉందని, మూడు పేర్లలో తనది ఒకటి అని కొందరు ప్రచారం చేసుకుంటున్నారు.

వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు మంగళ, బుధ వారాల్లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరుసగా భేటీలు జరుపుతున్న వేళ, ఆశావహులు టికెట్ దక్కించుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఢిల్లీ స్థాయిలో పైరవీలను పార్టీ అధిష్టానం ప్రోత్సహించడం లేదు. శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలు, రాష్ట్ర నాయకత్వం సిఫార్సులు, అభ్యర్థుల బలాబలాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని గెలుపే పరమావధిగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాలపై ఫ్లాష్ సర్వే నిర్వహించిన అధిష్టానం, ఆ సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో తెలంగాణలోని 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా 13 స్థానాల విషయంలో రాష్ట్ర నాయకత్వం తీవ్ర కసరత్తు చేసింది.

- Advertisement -

మంగళవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 5-6 స్థానాలపై రాష్ట్ర, జాతీయ నాయకత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, మిగతా స్థానాలపై మరో దఫా జరిగే సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి అధిష్టానం పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఢిల్లీలో సికింద్రాబాద్ ఆశావహులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గం ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బొంతు రామ్మోహన్, దానం నాగేందర్‌ మధ్య గట్టి పోటీ నెలకొనగా, పార్టీలో మొదటి నుంచి మరికొందరు నేతలు ఢిల్లీ చేరుకుని వలస నేతలకు టికెట్లు ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఎం. వినోద్ రెడ్డి, ఆడిటర్ బోనుమల్ల వేణుగోపాల స్వామి, విద్యాసంస్థల అధినేత్రి విద్యా స్రవంతి తదితరులు కూడా టికెట్లు ఆశిస్తున్న విషయం తెలిసిందే.

వీరిలో వేణుగోపాల స్వామి కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అధిష్టానం పెద్దల చుట్టూ తిరిగి ప్రయత్నాలు చేసుకోగా.. తాజాగా వినోద్ రెడ్డి, బొంతు రామ్మోహన్ ఢిల్లీలో మకాం పెట్టారు. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని వినోద్ రెడ్డి కోరుతుండగా.. సామాజిక సమీకరణాల ప్రకారం తనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బొంతు రామ్మోహన్ చెబుతున్నారు.

అధిష్టానం సైతం బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వానికే తొలుత మొగ్గుచూపింది. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బొంతు రామ్మోహన్ భార్య యాదవ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో.. బీసీల్లో అధిక సంఖ్యలో ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లను ఆకట్టుకోవచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే బొంతు అభ్యర్థిత్వంపై పార్టీలో మొదటి నుంచి ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం, అనుచరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలిసింది.

బొంతు రామ్మోహన్ గెలుపొందితే మరో 2 దశాబ్దాల పాటు సికింద్రాబాద్‌లో పాతుకుపోతారన్న అభిప్రాయంతో అంజన్ కుటుంబం తనను వ్యతిరేకిస్తోందని బొంతు భావిస్తున్నారు. ఇదే సమయంలో మున్నూరు కాపు వర్గానికే చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి తిరిగి రావడంతో ఆయన్ను కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. నగరంలో గతంలో బలమైన కాంగ్రెస్ నేతల్లో ఒకరిగా ఉన్న దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఓడించే సత్తా కూడా ఉందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఒకవేళ ఓడిపోయినా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని భరోసా ఇచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో బొంతు రామ్మోహన్ ఢిల్లీ చేరుకుని అధిష్టానం పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. అంతిమంగా ఇద్దరిలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కూడా గత కొన్నాళ్లుగా ఢిల్లీలోనే మకాం వేశారు. దేశంలో ఎక్కడికైనా సరే రైల్లో మాత్రమే ప్రయాణించే జగ్గారెడ్డి, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సమావేశం కోసం ముంబై వెళ్లి, రాహుల్ గాంధీతో కరచాలనం చేశారు.

మళ్లీ అక్కణ్ణుంచి తిరిగి ఢిల్లీ చేరుకున్న జగ్గా రెడ్డి అధిష్టానం పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. అయితే పైకి మాత్రం తాను ఏ సీటూ కోరుకోవడం లేదని, తన కుటుంబం నుంచి కూడా ఎవరికీ టికెట్ అవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మెదక్ స్థానం కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తున్న సోషల్ మీడియాలో మాత్రం వార్తలు గుప్పుమంటున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారికి లోక్‌సభ టికెట్లు ఇవ్వడం కుదరదని అధిష్టానం తేల్చి చెప్పిందని, అందుకే ఆయన తన కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇలా మొత్తంగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో కొందరు మకాం వేయగా, మరికొందరు సెంట్రల్ ఢిల్లీలోని స్టార్ హోటళ్లలో బస చేస్తూ టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement