లావోస్ ఈస్ట్ అసియా సమ్మిట్‌లో ప్రధాని మోదీ
ఈ యుద్దాలతో నష్టపోతున్నది సౌత్ దేశాలే
ఉగ్రవాదంతోనూ శాంతికి పెను ప్రమాదం
కలిసికట్టుగా ఎదుర్కొంటేనే మానవళికి మనుగడ
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ:
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లావోస్‌లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో శుక్రవారం ప్రసంగిస్తూ.. తాను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చానని పేర్కొన్నారు. ఇది యుద్ధాల యుగం కాదని.. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు లభించవు అని అన్నారు.
ప్రపంచ శాంతికి ఉగ్రవాదంతో ముప్పు..
ప్రపంచ శాంతిభద్రతకు ఉగ్రవాదం సైతం తీవ్రమైన సవాలుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ కలసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా సైబర్, సముద్ర, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని కోరారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలని మోదీ అభిలంషించారు. యురేషియా, పశ్చిమాసియాల్లో శాంతి స్థిరత్వం పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
ఐక్య రాజ్యసమితి చట్టాలకు లోబడి సముద్ర కార్యకలాపాలు జరగాలని ఈ సదస్సులో మోదీ స్పష్టం చేశారు. ఈ సదస్సులో ముందుగా ఇటీవల వియత్నాంలో యాగి తుపాను కారణంగా మరణించినవారికి సంతాపం ప్రకటించారు.