Friday, November 22, 2024

Asia Cup – మ‌రికొద్దిసేప‌టిలో దాయాదుల పోరు….

కొలంబో: ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగనుంది. ప్ర‌స్తుతం కొలంబోలో వాతావరణం పొడిగా ఉందని తెలిపింది. ప్రేమదాస స్టేడియంపై కేవలం తేలికపాటి మబ్బులు మాత్రమే ఉండటంతో మ్యాచ్ పూర్తిగా జ‌ర‌గ‌నుంది. కాగా, లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు భారత్‌ టాపార్డర్‌ను బెంబేలెత్తించగా అదే జోరు మరోసారి కొనసాగించాలని పాకిస్థాన్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. అయితే నిలదొక్కుకుంటే వాళ్ల బౌలింగ్‌లో పరుగులు అలవోకగా సాధించొచ్చు అని ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా నిరూపించడంతో భారత్‌ ప్రశాంతంగా ఉంది. గాయం కారణంగా లీగ్‌ స్టేజ్‌కు అందుబాటులో లేని వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి రావడం.. టీమ్‌ఇండియాకు కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. గత మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆడిన ఇషాన్‌ కిషన్‌ పాక్‌పై విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఇప్పుడు తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పాకిస్థాన్‌పై మంచి రికార్డు ఉన్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ఇంకా నెల రోజుల వ్యవధి కూడా లేని నేపథ్యంలో భారత జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తున్నది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ పేసర్లకు భారత టాపార్డర్‌కు మధ్య రసవత్తర పోరు ఖాయమే. రైద్దెన మ్యాచ్‌లో పాక్‌ ప్రధాన పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది ధాటికి మనవాళ్లు పెవిలియన్‌కు వరుస కట్టిన విషయం తెలిసిందే. తొలి స్పెల్‌ను సమర్థవంతంగా కాచుకుంటే ఆ తర్వాత షాహీన్‌ బౌలింగ్‌లో పరుగులు చేయడం పెద్ద కష్టం కాదని మాజీ ప్లేయర్లు సూచిస్తున్న నేపథ్యంలో ఈ సారి మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే ఆసక్తికరం. ఈ ఏడాది మార్చి నుంచి ఇంత వరకు ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా ఆడని రాహుల్‌ను నేరుగా పాకిస్థాన్‌తో కీలక పోరులో బరిలోకి దింపుతారా లేక కీపర్‌గా ఇషాన్‌నే కొనసాగిస్తారా చూడాలి. వ్యక్తిగత కారణాల వల్ల నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి రావడంతో భారత్‌ పేస్‌ బలం మరింత పెరిగింది. దీంతో మహమ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కాకతప్పదు. మరోవైపు షాహీన్‌ షా, నసీమ్‌ షా, హరీస్‌ రవుఫ్‌తో పాక్‌ బౌలింగ్‌ పటిష్టంగా ఉండగా.. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో పాటు ఫఖర్‌, ఇమామ్‌, రిజ్వాన్‌, సల్మాన్‌, షాదాబ్‌, ఇఫ్తిఖార్‌తో బ్యాటింగ్‌ కూడా శత్రు దుర్బేధ్యంగా కనిపిస్తున్నది. బంగ్లాదేశ్‌పై విజయంతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాక్‌ ఈ మ్యాచ్‌లో అదనపు పేసర్‌తో బరిలోకి దిగనుంది.


తుది జట్లు
భారత్‌ (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌/ఇషాన్‌, పాండ్యా, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌.
పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), ఫఖర్‌, ఇమామ్‌, రిజ్వాన్‌, సల్మాన్‌, ఇఫ్తిఖార్‌, షాదాబ్‌, అష్రఫ్‌, షాహీన్‌, నసీమ్‌, రవుఫ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement