Saturday, November 23, 2024

Asia Cup – బంగ్లా చేతిలో పోరాడి ఓడిన భారత్

కొలంబో: ఆసియా క‌ప్ చివ‌రి సూప‌ర్ 4 మ్యాచ్‌లో టీమిండియా బంగ్లా చేతిలో పోరాడి ఓడిపోయింది.. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుత విజ‌యం సాధించింది.

బంగ్లాదేశ్, భారత జట్టుపై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. నామమాత్రపు మ్యాచ్‌లో 5 మార్పులతో బరిలో దిగిన భారత జట్టు, ఆఖరి ఓవర్ దాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.. ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కి 11 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయం ఇదే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే ఆసియా కప్‌లో టీమిండియా ఎదుర్కొన్న మొదటి ఓటమి కూడా ఇదే. 266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

266 ప‌రుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ రెండో బంతికి డకౌట్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్‌ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న తెలుగుకుర్రాడు తిలక్ వర్మ, ఆరంగ్రేటం వన్డేలో ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన తిలక్ వర్మ, తంజీమ్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 57 పరుగులు జోడించారు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మహెదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 5 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.. వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్, నేటి మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

170 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా. శుబ్‌మన్ గిల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ స్కోరు బోర్డును కదిలించాడు.133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 121 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మహెదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, తోహిద్ హృదయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

- Advertisement -

చివ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్(42), శార్ధూల్ ఠాకూర్‌(11) ఎనిమిదో వికెట్‌కు విలువైన 40 ప‌రుగులు జోడించారు. అయితే.. చివ‌రి రెండు ఓవ‌ర్లో 17 ర‌న్స్ అవ‌స‌రం అయ్యాయి. 19వ ఓవ‌ర‌ల్ వేసిన ముస్తాఫిజుర్ రెండు బంతుల తేడాతో ఈ ఇద్ద‌రినీ పెవిలియ‌న్ పంపాడు. 50వ ఓవ‌ర్ నాలుగో బంతికి ష‌మీ(5) ర‌నౌట‌య్యాడు. దాంతో, బంగ్లా 6 ప‌రుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ కొట్టింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. కెప్ట‌న్ ష‌కిబుల్ హ‌స‌న్‌(80), తౌహిద్ హృదోయ్‌(54) అర్ధ శ‌త‌కాల‌తో అదుకోగా.. చివ‌ర్లో వ‌చ్చిన న‌సుమ్ అహ్మ‌ద్‌(44) దంచి కొట్టాడు. దాంతో, 8 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు స్కోర్ చేయ‌గ‌లిగింది. భార‌త బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ ఒక్క‌డే 3 వికెట్ల‌తో రాణించాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement