Tuesday, November 26, 2024

నారాయణ కళాశాల ఏవో అశోక్‌రెడ్డి మృతి.. ఓ విద్యార్థి సంఘం ‘పెట్రో’ ఘ‌ట‌న‌తో దారుణం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కలకలం సృష్టించిన అంబర్‌పేట నారాయణ కళాశాలలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనలో ఆదివారం కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అశోక్‌రెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అంబర్‌పేటలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో విద్యార్థి పెండింగ్‌పడ్డ ఫీజుల విషయంలో ఓ విద్యార్థి నాయకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సాయినారాయణ అనే విద్యార్థి కళాశాలలో ఇంటర్‌ విద్య పూర్తి చేశారు. కళాశాలకు రూ.16వేల ఫీజు బకాయి చెల్లించాల్సి ఉండగా మొత్తం చెల్లిస్తేనే బదిలీ సర్టిఫికెట్‌ ఇస్తానని యాజమాన్యం తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సాయి నారాయణ కళాశాలకు వెళ్లారు. ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని చెప్పడంతో ఈ విషయాన్ని ఆ విద్యార్థి మరోవిద్యార్థి నాయకుడు సందీప్‌కు చెప్పాడు.

సందీప్‌ మరికొంత మంది విద్యార్థిసంఘం నేతలను పెట్రోల్‌తోసహా కళాశాలకు వెళ్లి అక్కడి ప్రిన్సిపాల్‌ను, ఇతర సిబ్బందిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో సందీప్‌కు, ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫీజు విషయం, సర్టిఫికెట్ల అంశంపై మాట్లాడుతుండగా సందీప్‌ ప్రిన్సిపాల్‌ను బెదిరించేందుకు తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. పక్కనే టేబుల్‌పై దీపం ఉండడంతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలను అదుపుచేసేందుకు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అశోక్‌రెడ్డి ప్రయత్నించారు. దీంతో వారిద్దరికి కాలిన గాయాలయ్యాయి. మంటలకు గదిలోని ఫర్నీచర్‌, ఏసీ దగ్దమైంది. కుర్చీలు, ఇతర వస్తువులు కూడా మంటల్లో బుగ్గయ్యాయి. గాయపడిన ముగ్గురిని తొలుత గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత డీఆర్‌డీఎల్‌ అపోలోకు తరలించారు. చికిత్స పొందుతున్న అశోక్‌రెడ్డి ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గాయపడిన ఇద్దరు విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్‌ చికిత్స పొందుతున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement