లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది. మిశ్రా బెయిల్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తన వాదనను కోర్టుకు తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో ఆశిష్ మిశ్రా బెయిల్‌ను యూపీ ప్రభుత్వం వ్యతిరేకించలేదంటూ లఖింపుర్ బాధిత కుటుంబాలు చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. అతడి బెయిల్ దరఖాస్తును మేం తీవ్రంగా వ్యతిరేకించాం. బెయిల్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేసే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేగాక, ఈ కేసులో సాక్షులకు తగిన భద్రత కల్పిస్తున్నాం అని యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఈ సందర్భంగా లఖింపుర్ ఘటనలో సాక్ష్యులపై దాడి జరిగినట్లు వస్తోన్న వార్తలను కూడా యూపీ ప్రభుత్వం ఖండించింది. ”తమపై దాడి జరిగినట్లు లఖింపుర్ ఘటన సాక్షులు చెప్పలేదు. ఈ ఘటనలో బాధితులు, సాక్షుల కుటుంబాలకు నిరంతర భద్రత కల్పిస్తున్నాం. సాక్ష్యులకు సాయుధ సిబ్బందిని రక్షణ కల్పిస్తున్నాం” అని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు లఖింపుర్ ఖేరి ఘటనలో గత నెల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతేగాక, ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించాయి. ఆశిష్ బెయిల్‌పై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ జరపనుంది.