Tuesday, November 19, 2024

ఆసరా పింఛన్లు ఇక 57 ఏళ్లకే.. కొత్తగా 10 లక్షల మందికి అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎప్పటినుంచో వృద్ధులు ఎదురు చూస్తున్న వృద్ధాప్య పింఛన్ల ఆర్హుత వయో పరిమితి, కొత్త పింఛన్లు ఏక కాలంలో అమలులోకి వచ్చాయి. పంద్రాగష్టు కానుకగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వరాలు క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్‌ చేస్తూ సంబంధిత శాఖలు వేగం పెంచాయి. ఈ క్రతువులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మమేకమయ్యేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. నూతన లబ్దిదారులకు, పాతగా పెన్షన్‌ పొందుతున్న వారికి నూతన ఆసరా కార్డుల జారీ, పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇందుకు అనువుగా కొత్త కార్డులను జిల్లాలకు తరలించారు. 65ఏళ్లనుంచి 57ఏళ్లకు పింఛన్‌ అర్హత వయసును తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా 9,46,117మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరీ చేశారు. ప్రస్తుతం ఉన్న 35.95లక్షల పెన్షన్లతో కలుపుకుని ఈ సంఖ్య 45.41లక్షలకు చేరనుంది. 12 వేల మంది డయాలసిస్‌ రోగులకు కూడా ప్రభుత్వం మానవీయ కోణంలో పెన్షన్లను మంజూరీ చేసింది. దీంతో ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ. 3240కోట్ల భారం పడనుంది. తాజాగా గతేడాది పెన్షన్‌ వయోపరిమితి అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ సర్కార్‌ సంచలన నిర్ణయం అమలులోకి తెచ్చింది. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను కన్న కొడుకులే పోషించలేక వదిలేస్తున్న ధీనస్థితిని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ వారందరి పెద్ద కొడుకుగా వద్ధాప్యంలోని అభాగ్యుల తలరాతను మార్చి వేశారు. ఒక్కో ఇంటిలోని ఒక్కొక్కరికి వృద్ధాప్య పింఛన్‌గా రూ. 2016ను ప్రతీ నెలా క్రమం తప్పకుండా అందించి వారి కడుపు నింపుతున్నారు. అదే కోవలో వృద్ధుల జీవితాల్లో ఆశలు పెంచుతూ ఆసరా పథకంలో కొత్త లబ్దిదారులు ప్రయోజనం పొందేందుకు సర్వం సిద్దమైంది. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలులోకి తెచ్చి వృద్ధులకు మరో వరాన్ని అందుబాటులోకి తెచ్చారు. నేటినుంచి ఆసరా పింఛన్ల వయో పరిమితి తగ్గింపు అమలులోకి వచ్చింది. వృద్దాప్య పెన్షన్లకు ఆర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో – 36ను విడుదల చేశారు.

అయితే కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్త చనిపోతే బార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్‌ బదలీ చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ గత మూడేళ్ల క్రితం అసెంబ్లిd ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీనిచ్చారు. ఇప్పటివరకు 65ఏళ్లుపైబడిన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్‌ను ప్రభుత్వం అందిస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం లబ్దిదారులను గుర్తించి పెన్షన్‌ అందజేతకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ చర్యలు తీసుకుని వివరాలను ప్రభుత్వానికి నివేదించింది.

రాష్ట్రంలో మరో 10లక్షల ఆసరా పెన్షన్ల ప్రకటనతో మూడున్నరేళ్లుగా వేచిచూస్తున్న 3.3లక్షల మందికి లబ్ది చేకూరుతున్నది. మరో 57ఏళ్లు దాటిన 7.8లక్షల దరఖాస్తులకు కూడా లైన్‌ క్లీయర్‌ అయింది. వృద్ధాప్య 68,186, వితంతు 1,68,582, దివ్యాంగులు 56,986, గీతకార్మికులు 6611, నేత కార్మికులు 3356, బీడి కార్మికులు 5665, ఒంటరి మహిళలు 11491, కళాకారులు 5485, పైలేరియా3727తోపాటు కొత్తగా 12వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు మంజూరీ అయ్యాయి. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయసును 65ఏళ్లనుంచి 57ఏళ్లకు గతేడాది ఆగష్టులో తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 7.8లక్షలమందికిపైగా దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38.41లక్షల మందికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు రూ. 3016, ఇతర విభాగాల పెన్షనర్లకు నెలకు రూ. 2016లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో రూ. 11,728కోట్లను కేటాయించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement