అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డ్రైవింగ్, వాహన రికార్డు సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులకు కాలం చెల్లింది. ఇందుకు సంబంధించి ఏపీ రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్మార్ట్ విధానంలో కాగితాలు మాత్రమే డౌన్‌లోడు చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్ డౌన్‌లోడు చేసుకొని డిజిటల్ డాక్యుమెంట్లు కార్డులు డౌన్‌లోడు చేసుకోవచ్చు. వాటిని తనిఖీ అధికారులకు చూపించే వెసులుబాటు కలిపిస్తూ ఏపీ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది.
గత జూలైకి ముందు ఇవ్వాల్సిన మాన్యువల్ కార్డులను ప్రింట్ చేసి ఇవ్వనున్నారు. గతంలో ఫిజికల్ కార్డులను మాత్రమే తనిఖీ అధికారులు అనుమతించేవారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వాహనదారుల నుంచి డ్రైవింగ్, ఆర్సీ కార్డుల కోసం కొంత రుసుము తీసుకోవడం, ఆ తర్వాత ప్రింట్ చేసి వీరికి ఇవ్వడం శ్రమతో కూడుకుంది.
సకాలంలో వీటి తయారీ లేకపోవడం, కొన్ని కార్డులు అందజేయడంలో పోస్టల్ జాప్యం వంటి పలు అంశాలు ప్రతికూలంగా మారాయి. రానున్న రోజుల్లో ఈ తరహా సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ అర్హత పరీక్షలు, వాహన ఫిట్‌నెస్ పరీక్షలు ముగిసిన తర్వాత వీటిని ఆర్టీఏ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాగితం పత్రాలు ఇబ్బంది అనుకుంటే ఆర్టీఏ యాప్‌లో డౌన్‌లోడ్‌లో చేసుకున్న పత్రాలను మొబైల్‌లో నిక్షిప్తం చేసుకొని చూపితే సరిపోతుంది.
పెండింగ్‌లో 75 వేల డ్రైవింగ్ లైసెన్సులు
గత జూలై నాటికి లక్షా 75వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర రవాణాశాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లాల వారీగా పది నుంచి 15వేల వరకు ఉండొచ్చని అంచనా. గతంలో రకరకాల కారణాలతో వీటి ముద్రణలో జాప్యం చోటు చేసుకుంది. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఫిజికల్ కార్డులు ముద్రించి తొందరలోనే అందజేయనున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఫిజికల్ కార్డుల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
డిజిటల్ డీఎల్, ఆర్సీలతో లాభాలెన్నో!
డిజిటల్ కార్డులతో వాహనదారులకు ఖర్చు తగ్గుతుంది. అధికారులకు సమయం ఆదా అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల కోసం ఇప్పటి వరకు రవాణాశాఖ రూ.225 వరకు వసూలు చేస్తున్నది. డిజిటల్ విధానంలో ఈ ఖర్చు వాహనదారులకు ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రవాణాశాఖకు సంబంధించిన సేవలను ‘వాహన్ పరివార్ ‘ పేరిట ఇప్పటికే ఆన్‌లైన్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పలు రాష్ట్రాల్లో డిజిటల్ కార్డులే చెలామణిలో ఉన్నాయి.
ప్రారంభంలో కొన్ని రాష్ట్రాలు డిజిటల్ కార్డులను అనుమతించ లేదు. దీనిపై పలు రాష్ట్రాల్లో వివాదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో డిజిటల్ కార్డుల అనుమతికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత రాష్ట్రాలకు డిజిటల్ కార్డుల విషయంలో స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రవాణా, పోలీసు తదితర శాఖలకు డిజిటల్ కార్డులను అనుమతించాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్మార్ట్ ఫోన్లు లేని పక్షంలో పేపరుపై ప్రింట్ తీసుకొని తనిఖీ అధికారులకు చూపిస్తే సరిపోతుంది.