హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోజు రోజుకు ఎండలు మండిపోతుండడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వారం క్రితం వరకు అకాల వర్షాలతో నడు వేసవిలో వానాకాలాన్ని తలపించిన వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భానుడు సెగలు కక్కాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లేని స్థాయిలో పలు జిల్లాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావవరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ నమోదుకానంతగా రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుండే భానుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కాలు బయటపెట్టలేని పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. కరీంనగర్, జగితీఆల, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి ప్రతి రోజూ ఈ జిల్లాల్లో 45 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గరిష్టంగా 45.9 డిగ్రీలు, జన్నారంలో 45.8, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కొమురంభీం ఆసీఫాబాద్ కెరమెరిలో 45.4 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా ముష్కల్‌లో 45.1, నల్గొండ జిల్లా పజ్జూరులో 45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టీ)లో 44.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 44.8, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 44.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 44.7 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రం వైపు వాయివ్య దిశ నుంచి దిగువస్థాయి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 43డిగ్రీల దాకా ప్రతిరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వారంపాటు హైదరాబాద్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుండి గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల వరకు ఉంటుందని వెల్లడించారు.
భానుడి ప్రతాపానాకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీధులన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు జన సంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం 5 దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.