Monday, November 25, 2024

సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా.. మరోసారి బాలశౌరి నియామకం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి వరుసగా మూడోసారి నియమితులయ్యారు. బుధవారం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్లో వివిధ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 15 మంది సభ్యులతో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీని ఏర్పాటు చేయగా, 14 మందిని నియమించారు. వారిలో బాలశౌరిని మరోసారి ఛైర్మన్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సభ్యులుగా మాణికం టాగోర్, పినాకి మిశ్రా, డా. ప్రీతమ్ గోపీనాథ్ రావు ముండే, చండేశ్వర్ ప్రసాద్, ఎన్.కే. ప్రేమచంద్రన్, సురేశ్ కుమార్ పూజారి, ఎ. రాజా, నామ నాగేశ్వర రావు, సంజయ్ సేథ్, డా. అమర్ సింగ్, బ్రిజేంద్ర సింగ్, తిరునావుక్కరాసర్, రామ్ కృపాల్ యాదవ్ ఉన్నారు. ఎన్డీయే-2 ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్సీపీకే చెందిన రఘురామకృష్ణ రాజును నియమించారు. ఆ తర్వాత ఈ పదవిని బాలశౌరికి ఇచ్చారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఛైర్మన్‌గా బాధ్యతలు నెరవేర్చిన బాలశౌరి ఇప్పుడు మూడోసారి కొనసాగనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్ ఓం బిర్లాకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ బాలశౌరి ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement