అదృష్టం వరించడంతో ఓ సాధారణ కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం చూస్తూనే ఉంటాం.. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించడంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార గనిలో రూ. 60 లక్షల విలువైన 13 క్యారెట్ల వజ్రం లభించడంతో అతని అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయిందని ఓ అధికారి తెలిపారు.
ములాయం సింగ్ కనుగొన్న వజ్రం బరువు 13.54 క్యారెట్లు, దీని విలువ కనీసం 60 లక్షల రూపాయలు అని డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. సింగ్తో పాటు, ఇతర కార్మికులు వేర్వేరు బరువుల ఆరు వజ్రాలను కనుగొన్నారని అధికారి తెలిపారు. ఈ ఆరు వజ్రాలలో రెండు వజ్రాలు వరుసగా 6-క్యారెట్లు, 4-క్యారెట్ల బరువు కలిగి ఉండగా, మరికొన్ని వరుసగా 43, 37, 74 సెంట్లు బరువు కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా…. గతంలో కూడా మధ్యప్రదేశ్లో ఓ కూలీకి యాభై లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో వజ్రాల వేటకు వెళ్లిన ఆనందిలాల్ కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital