Friday, November 22, 2024

కామన్‌ పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఈ ఏడాదీ లేనట్టే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కామన్‌ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ ఈ ఏడాది కూడా అమలుకు నోచుకోవడంలేదు. వచ్చే ఏడాది నుంచైనా దీన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. కామన్‌ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇంకా ఖరారు కాకపోవడంతోపాటు, విద్యార్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా దీన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనే నిర్ణయానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామన్‌ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ కింద వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ఆహ్వానించనున్నారు. అయితే జనరల్‌ కోర్సుల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు నిర్వహించే ఎంట్రెన్స్‌ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకు, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్ల ఎంట్రెన్స్‌ నిర్వహణ బాధ్యత జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు అప్పగించనున్నారు. కామన్‌ పీహెచ్‌డీ విధానాన్ని అమలు చేయాలని గత రెండేళ్లుగా ఉన్నత విద్యామండలి ప్రయత్నం చేస్తోంది. కానీ అది ఏమాత్రం కార్యరూపం దాల్చడంలేదు.

ఈ ఏడాదైనా కామన్‌ పీహెచ్‌డీ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్‌, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలల్లో పీహెచ్‌డీ సీట్లను భర్తీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావించింది. కానీ కామన్‌ పీహెచ్‌డీ విధానంతో వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందనే అభిప్రాయాలను పలు వర్సిటీల వీసీలు వ్యతిరేకిసున్నారు. అదేవిధంగా కామన్‌ పీహెచ్‌డీ విధానాన్ని మొదటి నుంచి విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటియే స్వేచ్ఛగా పీహెచ్‌డీ అడ్మిషన్లు జరుపుకునే విధానాన్ని యదావిథిగా ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే చివరిసారిగా 2020లో జేఎన్‌టీయూ, 2021లో కాకతీయ వర్సిటీ, ఈ ఏడాది ఉస్మానియా వర్సిటీ వేరువేరుగా పీహెచ్‌డీ నోటిఫికేషన్‌లు జారీ చేశాయి. త్వరలో జేఎన్‌టీయూహెచ్‌తో పాటు మిగతా ఒకటి రెండు వర్సిటీలు సైతం ఈ ఏడాదికి పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నుంచైనా కామన్‌ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement