దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉన్నారు. భార్యకు పాజిటివ్ రావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్నారు. సునీత కేజ్రీవాల్ కు కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమె టెస్ట్ చేయించుకున్నట్లు తెలిసింది. టెస్ట్ రిజల్ట్‌లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత సంవత్సరం జూన్‌లో సీఎం కేజ్రీవాల్‌కు కూడా కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ఆరు రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా అందరికీ లాక్ డౌన్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని సీఎం కోరారు. కాగా ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 23వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.