పంజాబ్ ప్రజలకు రెండు వాగ్దానాలు చేస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే పంజాబ్‌లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లు నిర్మిస్తాం. అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్ కు చెందిన సైనికులు ఎవరైనా సరిహద్దులో వీరమరణం పొందితే ఆ కుటుంబానికి కోటి రూపాయలు అందజేస్తాం. అన్నారు ఆఫ్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈరోజు (గురువారం) పంజాబ్ పర్యటనలో ఆయన ప్రజలతో మాట్లాడారు.
గతేడాది మెలానియా ట్రంప్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చూడాలనుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అమెరికాలో కూడా ప్రసిద్ధి చెందాయి. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే, పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను చూడటానికి అమెరికా, కెనడా, లండన్ నుంచి ప్రజలు తరలి వస్తారు అని స్పష్టం చేశారు కేజ్రీవాల్. గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్ వంటి ఏరియాల నుంచే భారత సైన్యంలో అత్యధిక సంఖ్యలో సైనికులు ఉన్నారు. యుద్ధాలలో అమరులైన సైనికుల సంఖ్య కూడా ఈ రెండు ప్రదేశాలకు చెందిన వారే ఉంటారు. అట్లాంటి సైనికులు దేశంలో ఉండటం నా అదృష్టం అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.