Saturday, November 23, 2024

రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత.. రైతులను దోచుకుంటున్న దళారులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎరువులు, డీఏపీ కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి తోమర్‌లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం వారిరువురికి వేర్వేరుగా లోకేష్‌ లేఖలు రాశారు. రాష్ట్రంలో బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుని యుద్ధప్రాతిపదికన డీఏపీ సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాలకు డీఏపీ సరఫరాలో కోత విధించి ఆర్బీకేలకు మళ్లించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రధానికి లోకేష్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డీఏపీ ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్‌ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల టన్నుల డీఏపీని కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌ మార్కెటింగ్‌, అసమర్థ విధానాల వల్ల కృత్రిమ కొరత ఏర్పడిం దని ఆరోపించారు.

కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డీఏపీ ఎరువులను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పంపిణీ విధానాన్ని మార్చేశారని లేఖలో ఫిర్యాదు చేశారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయాల్సిన ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు మళ్లించిందని అయితే ఆర్బీకేల్లో డీఏపీ అందుబాటులో లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు బహిరంగ మార్కెట్లో 50 కేజీల డీఏపీ బస్తాను రూ. 300 అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతాంగంపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి డీఏపీ సరఫరాను పెంచి కృత్రిమ కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌ నుంచి రైతాంగాన్ని కాపాడాలని నారా లోకేష్‌ లేఖ ద్వారా ప్రధాని, కేంద్రమంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement