చందమామపై దిగేందుకు మొదలైన ప్రయాణం మరొక్క రోజు సాఫీగా సాగిపోతే చాలు… ఆర్టిమిస్ 1 మిషన్‌లో భాగంగా దూసుకుపోతున్న ఓరియోన్ వ్యోమనౌక చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. భూమి నుంచి అంతరిక్షంలో అత్యధిక దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా రికార్డు నెలకొల్పనుంది. గంటకు 4,200 కి.మి వేగంతో దూసుకుపోతున్న ఈ వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. మొత్తం 25 రోజుల్లో చందమామపై దిగడం ఈ మిషన్ లక్ష్యం. కేప్ కేనవెరల్ నుంచి దూసుకుపోయిన ఈ అంతరిక్ష నౌక శుక్రవారం నాటికి వరుసగా 9 రోజులు ప్రయాణం సాఫీగా సాగిపోయింది. మరొక్క రోజు ప్రయాణం చేస్తే గతంలో అపోలో 13 పేరిట ఉన్న రికార్డును అధిగమించనుంది. వ్యోమగాములతో అంతరిక్షంలో సుదూరంగా, అంటే 4,00,171 కి.మి. మేర ప్రయాణించిన అపోలో 13 రికార్డును చెరిపేయనుంది.
గతంలో చందమామపై అడుగుపెట్టేందుకు ఎన్నో దేశాలు.. ఎన్నో ప్రయత్నాలు చేశాయి. నాసా ఏడుసార్లు అపోలో మిషన్‌ను చేపట్టింది. అందులో మూడుసార్లు మానవసహిత ప్రయోగాలు చేపట్టింది. అపోలో 13 పేరుతో చేపట్టిన మిషన్ ఏడవది. ముగ్గురు వ్యోమగాములతో బయలుదేరిన ఆ అంతరిక్ష నౌక రెండు రోజుల ప్రయాణం అనంతరం సర్వీస్ మాడ్యూల్‌లోని రెండు ఆక్సిజన్ ట్యాంకులు విఫలవడంతో సమస్య ఏర్పడింది. చందమామను చేరాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. అయితే, ముగ్గురు వ్యోమగాములతో ఆ నౌకను సురక్షితంగా భూమికి తీసుకురాగలిగారు. మొత్తంమీద అపోలో 13 తన మిషన్‌లో 4,32,192 కి.మి ప్రయాణించాల్సి ఉంది.. మానవులు తయారు చేసిన ఒక వ్యోమనౌక 4,00,171 దూరం ప్రయాణించడం ఓ రికార్డు. ఇప్పటివరకు ఆ రికార్డు బ్రేక్ కాలేదు. ఇప్పుడు ఓరియోన్ ఆ రికార్డును చెరిపేయనుంది.
మానవులను చందమామపైకి చేర్చే అవకాశాలను ఈ మిషన్ శోధిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 80,467 కి.మి ఎగువన నిర్ణీత చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ చంద్రుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుడి కక్ష్య చాలా పెద్దది. దాని ఒకవైపు పార్శ్వాన్ని చుట్టి రావడానికి ఆ వ్యోమనౌకకు ఆరురోజులు పడుతుంది. వ్యోమనౌకపై ఉన్న సౌరఫలకాలపై అమర్చిన అత్యాధునిక కెమేరా చంద్రుడికి సంబంధించిన ఛాయాచిత్రాలను పంపుతుంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమణం పూర్తయిన తరువాత 25 ఓరియోన్ భూమికి చేరుకుంటుంది.