దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మద్యం సేవించి, తోటి ప్రయాణికులు, సిబ్బందిపై దుర్భాషలాడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు డ్యూటీ ఫ్రీ షాపు నుంచి తెచ్చుకున్న మద్యం సేవించి, సంబరాలు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పడంతో నిందితుల్లో ఒకరు మరింత రెచ్చిపోయాడని వారు అన్నారు. వారి నుంచి మద్యం సీసాలను విమాన సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విమానం ముంబైలో దిగిన తర్వాత ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారిని దత్తాత్రేయ బాపర్డేకర్, జాన్ జార్ట్ డిసౌజాగా గుర్తించిన పోలీసులు, వారిపై ఐపీసీ సెక్షన్లు 336 ( ఇతరుల ప్రాణాలు, భద్రతకు హాని కలిగించడం) తో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 21,22, 25 కింద కేసు నమోదు చేశారు..
దుబాయ్ నుంచి ముంబైకి 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు మద్యం మత్తులో ఉన్నట్టు గమనించి, అనేక మార్లు హెచ్చరించినప్పటికీ వారు విమానంలోనే మద్యం సేవించడం కొనసాగించారు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిని దుర్భాషలాడారని ఇండిగో తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం, వికృతంగా ప్రవిర్తించినందుకు వారిని సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బందికి అప్పగించారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. విమానంలో ప్రయాణికులు అసభ్యంగా, వికృతంగా ప్రవర్తించనట్టు కేసు నమోదు చేయడం ఈ ఏడాది ఇది ఏడవ ఘటన.