యోగా గురు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద ఎండీ బాలకృష్ణలకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దివ్య ఫార్మసీ తప్పుడు ఆరోగ్య ప్రకటనలపై కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వీరికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కేరళ రాష్ట్రానికి చెందిన నేత్ర వైద్యుడు కేవీ బాబు చేసిన ఈ ఫిర్యాదుతో మూడేళ్ల క్రితం కేరళలో 10 కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదైంది. అతని ఫిర్యాదులపై కేరళ డ్రగ్ కంట్రోల్ విభాగం చర్యలు ప్రారంభించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954ని ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పతంజలిని ఆదేశించిన సంగతి తెలిసిందే. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు బీపీ, షుగర్ వంటి వ్యాధులను నయం చేస్తాయని గతంలో వచ్చిన ప్రకటనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రకటనలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.