కొత్తగూడెం (సింగరేణి), ప్రభన్యూస్ : ఎరియర్స్ ఎప్పుడు..? అనే ప్రశ్నతో సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు అగ్గి రాజేస్తున్నారు. కోలిండియాలో ఆగస్టు నెల జీతాలతో కలిపి సెప్టెంబర్ నెలలో ఎరియర్స్ ఇవ్వాలని సర్కులర్ జారీ చేయగా.. సింగరేణి యాజమాన్యం మాత్రం బ్యాంకుల నుండి అప్పుల అన్వేషణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.32,000 కోట్ల టర్నోవర్, రూ. 2,222 కోట్లు నికర లాభాన్ని ప్రకటించుకున్నప్పటికీ అవి సంస్థ వద్ద నిల్వ లేనట్టుగా తెలుస్తోంది.
జూన్ 2023 నాటికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కోల నుండి సింగరేణికి 24730 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా ఈ విషయంపై ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉత్తరం ఇవ్వకపోవడంతో సంస్థ నిల్వలు మొతం బకాయిలుగానే ఉన్నట్టు తెలుస్తోంది.
అవి రాబట్టు కోవడంలో సింగరేణి అధికారులు విఫలమయ్యారని కార్మిక సంఘాలు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాయి. దీంతో కార్మికులకు ఎరియర్స్, లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించేందుకు సంస్థ వద్ద నిధులు లేక ఫైనాన్స్ విభాగం బ్యాంకర్ల వద్ద కసరత్తులు ముమ్మరం చేసిందని ప్రచారం నడుస్తోంది.
గనుల వ్యాప్తంగా ఎరియర్స్ కోసం నిరసనలు…
బొగ్గు గని కార్మికులకు దేశవ్యాప్తంగా 11వ వేతన ఒప్పందం జులై 2021 నుండి అమలులోకి రావాల్సి ఉండగా 23 నెలలు ఆలస్యంగా 2023 జూన్ నుండి అమలులోకి వచ్చింది. పెరిగిన కొత్త జీతాలను యాజమాన్యం యుద్ధప్రతిపాదికన అమలుపరుస్తున్నా… ఈ ఒప్పందం ప్రకారం రావాల్సిన 23 నెలల ఎరియర్స్ మాత్రం ఎప్పుడన్నది స్పష్టత ఇవ్వడం లేదు. కోలిండియా ఆగస్టు నెల జీతంతో కలిపి సెప్టెంబర్ మూడోతేదీన కొత్త జీతాల పెంపుతో పాటు బకాయి పడ్డ ఎరియర్స్‌ను కూడా చెల్లిస్తున్నట్టు సర్య్కులర్ జారీ చేసింది.
అప్పటినుండి సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాలలో అలజడి మొదలైంది. కోలిండియా ప్రకారమే సెప్టెంబర్ 3న ఎరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనునిత్యం బొగ్గు బావులలో కార్మిక సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ… త్వరతగతిన సింగరేణి యాజమాన్యం దీనిపై స్పష్టత ఇవ్వకపోతే అన్ని కార్మిక సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుపుతున్నారు.
తక్షణ అవసరానికి రూ. 2 వేల కోట్లు..
కార్మికులకు 23 నెలల ఎరియర్స్ చెల్లించేందుకు 1000 కోట్లు, లాభాల వాటా పంచేందుకు 700 కోట్లు, దీపావళి బోనస్ ఇచ్చేందుకు 300 కోట్ల రూపాయలు మొత్తం కలిపి సింగరేణికి రెండువేల కోట్ల రూపాయలు తక్షణ అవసరంగా కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రకటించుకున్న నికర లాభం కాగితాలకే పరిమితం కావడంతో యాజమాన్యం యధావిధిగా బ్యాంకుల నుండి రుణం పొందేందుకు కార్యచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
సింగరేణిని తన జేబు సంస్థగా పరిగణిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంస్థ లాభాలను ఇతర మార్గాల నుండి తమ అవసరాలకు మళ్లించుకుని లబ్ధి పొందుతున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, కాలేశ్వరం ప్రాజెక్టు అవసరాలకు వినియోగించుకున్న విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే ట్రాన్స్‌కో, జెన్‌కోలకు చెల్లించాల్సి ఉండగా సింగరేణిని అడ్డుపెట్టుకొని చెల్లించకుండా కాలయాపన చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక స్థితిగతులను ప్రకటించుకున్న సంస్థ
సిింగరేణి అప్పుల పాలు కాలేదని.. సుస్థిర లాభాల్లో ఉందని ఆ సంస్థ యాజమాన్యం ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రకటించింది. బ్యాంకులు, ఇతరత్రా సంస్థల్లో రూ.11,665 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, వీటి వల్ల ఏటా రూ.750 కోట్లకు పైగా రాబడి వస్తుందని, అలాగే వినియోగదారుల నుంచి రూ.15,500 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఈ లెక్కన రూ.27 వేల కోట్ల ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నట్లు తెలుపుకున్న సంస్థ.. కార్మికులకు ఎరియర్స్ చెల్లింపులలో జాప్యం ఎందుకు చేస్తోందో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది.