తొలి దశ డ్రోన్ ద్వారా మందుల రవాణా చేసే మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టిన రాష్ట్ర ఐటీ శాఖ త్వరలో దానికి విస్తరించే యోచనలో ఉంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) లకు వ్యాక్సిన్‌లతో పాటు మందులను ప్రయోగాత్మకంగా రవాణా చేశారు. ఈ ప్రయోగం విజయవంత మవడంతో త్వరలో భద్రాద్రి కొత్తగూడెంతో పాటు అదిలాబాద్ జిల్లాల్లోని సుదూర ప్రాంతాలకు డ్రోన్‌ల ద్వారామందులు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్‌ల ద్వారా మందులు రవాణా చేసేప్రాజెక్టును రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, నీతిఆయోగ్, అపోలో హాస్పిటల్స్‌కు చెందిన హెల్త్ నెట్ సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. వికారాబాద్‌లో 45 రోజుల పాటు జరిగిన డ్రోన్‌ల ద్వారా మందుల రవాణాలో 345 ట్రిప్పులలో మందులు రవాణా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగాత్మక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రోన్‌లు విజయవంతంగా మందులు తీసుకెళ్లినట్లు తేలింది. దీనికి సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత డ్రోన్‌ల ద్వారా మందుల రవాణాకు కేంద్ర విమానయాన శాఖ పచ్చజెండా ఊపినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వికారాబా ద్‌లో నిర్వహించిన డ్రోన్‌లతో మందుల రవాణా ప్రయోగంలో రికార్డు స్థాయిలో 42 కి.మీల సుదూర ట్రిప్పులో 1.8 కిలోల బరువున్న మందులను కేవలం 40 నిమిషాల్లో గమ్యం చేర్చినట్లు ఎమర్జింగ్ టెక్నాలజీ అధికారులు తెలిపారు. అయితే అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డ్రోన్‌లతో మందులు రవాణా చేసే ప్రాజెక్టు చేపట్టే ముందు డ్రోన్ కంపెనీల కన్సార్టియంనకు చెందిన ఒక బృందం 2 వారాల పాటు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తాయని తెలుస్తోంది. రెండు జిల్లాల్లోని సుదూర ప్రాంతాలకు ఎలాంటి మందులు అవసర మున్నాయనే విషయాన్ని ముందుగా తెలుసుకుని వాటి బరువు, పంపాల్సిన దూరం ఆధారంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అమలు చేయనున్నారు.
ఈసారి కేవలం మందులే కాకుండా రక్త నమూనాలు, ఇతర డయాగ్న స్టిక్స్ అవసరాలకు సంబంధించిన రవాణాను కూడా చేపట్టనున్నట్లు అధికారులుచెబు తున్నారు. వీటన్నింటి రవాణాకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రాజెక్టు అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టు నిర్వహించిన వికారాబాద్‌లో ఇక ముందు వాణిజ్యపరంగా కూడా డ్రోన్‌ల ద్వారా మందుల రవాణాను చేపట్టేందుకు డ్రోన్ కంపెనీల కన్సార్టియం యోచిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital