హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ పార్టీ ఆవిర్భావ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయపార్టీ ఏర్పాటు పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రి వెళ్లి లక్ష్మీ నర్సింహాస్వామిని దర్శించుకున్నారు. శనివారం వరంగల్ వెళ్తున్న కేసీఆర్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సిద్ధిపేట జిల్లా కోనాయపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తపార్టీ ఏర్పాటు పనుల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు నిమగ్నమయ్యారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులను పర్యవేక్షించేందుకు మంత్రి శుక్రవారం ఢిల్లి వెళ్లినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎటువంటి న్యాయపరమైన సమస్యలు, చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రాజ్యాంగ, న్యాయకోవిదులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. విజయ దశమి (దశమి) రోజున జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఆయనకు కలిసివచ్చే సెంటిమెంట్లను అమలు చేయాలని సంకల్పించారు. దసరా రోజు ఉదయం 11గంటలకు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మాణం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ ముఖ్యులతో సమావేశమై మధ్యామ్నం 1.19 నిమిషాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే జాతీయ పార్టీ పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం నాలుగు పేర్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ తొలినుంచీ ప్రచారం జరుగుతున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దసరా రోజునే ఈ పేరును ప్రకటిస్తారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. భారతదేశ చిత్రపటంలో గులాబీరంగు మిళితమై ఉంటుందని, గులాబీ రంగులోనే జాతీయ పార్టీ జెండాను రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటిదాకా తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బందు, రైతు భీమా, వ్యవసాయరంగానికి 24గంటలు ఉచిత విద్యుత్‌తో సహా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను హైలెట్ చేస్తూ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కరీంనగర్ లేదా వరంగల్ వేదికగా భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి ఈ సభలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దసరా రోజు పార్టీని ప్రకటించాక జాతీయస్థాయిలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు వీలుగా తొలి విడత అయిదుగురు పార్టీ సినియర్ నేతలను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌లను సమన్వయకర్తలుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
జాతీయ పార్టీ ఏర్పాటుతోపాటు అందుకనుగుణంగా కీలక అంశాలపై ఇప్పటికే జాతీయస్థాయిలో సమాలోచనలు జరిపిన కేసీఆర్ మేథావులు, విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో చర్చోపచర్చలు సాగించారు. జాతీయస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘం నేతలతో మూడు రోజులపాటు ప్రగతి భవన్లో సమావేశమై సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లుతుండడం, మోడీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు, భాజపాపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్పష్ట్మైన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. జాతీయ పార్టీ ప్రకటన రోజున కలిసివచ్చే పార్టీల నేతలను, తెరాసను అభిమానించే జాతీయస్థాయి నేతలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటన జరిపిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఆయన రావాలంటూ పిలుపునిచ్చారు.
జాతీయ పార్టీకి తమ మద్దతును కూడా ప్రకటించారు. భవిష్యత్‌లో మరిన్ని పార్టీలు తమతో జతకడుతాయన్న విశ్వాసంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు మాజీ సీఎం కుమారస్వామి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, రాజా తదితరులను జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరిని దసరా రోజున పిలవాలా..?, లేక త్వరలో ఏర్పాటు చేసే బహిరంగసభకు ఆహ్వానించాలా..? అన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
బడుగులకు పెద్దపీట…
తాను పెట్టబోయే జాతీయ పార్టీలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. అల్పసంఖ్యాక వర్గాలకు భాజపా వ్యతిరేకమన్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన ఎజెండాగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని, ఇందులో రైతులకు కూడా పెద్దపీట వేయాలని సంకల్పించారు.