హైదరాబాద్, ఆంధ్రప్రభ : వర్షాకాలం ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వానాకాలం కోతలు కూడా అక్కడక్కడ ప్రారంభం కావడంతో త్వరితగతిన కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లి ఎన్నికలు, కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. 2023 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల విషయమై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌తో రాష్ట్ర సివిల్ సప్లై వర్గాలు చర్చలు జరిపాయి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కోడ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని, ఈ ఏడాది వానాకాలం కూడా కొనుగోళ్లుసజావుగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయని తెలిపారు. ఇప్పటికే ఒకటి, రెండు చోట్ల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ప్రారంభించింది. గ్రామాల వారీగా కొను గోలు కేంద్రాల ఏర్పాటు, అవసరమైన వసతుల కల్పన, కొనుగోళ్ల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చని నేపథ్యంలో నవంబరు రెండో వారం నుండి జనవరి మొదటి వారం వరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను నిర్వహించనున్నారు.
నవంబరు రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది దాదాపు 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈఏడాది కూడా దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలను తెరవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఖరీఫ్ వరికోతలు ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే చాలా చోట్ల రైతులు వరి కోతలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు తెరుచుకునేసరికి సమయం పట్టనుండడంతో కోసిన వరిని రైతులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలును చేప డుతుండడం తో ప్రయివేటు వ్యాపారులు కూడా ధాన్యానికి సముచితమైన ధరనుచెల్లించి ధాన్యంకొనుగోలు చేస్తున్నారు., ప్రస్తుతం వరి మద్దతు ధర రూ.2143 ఉండగా… ప్రయివేటు వ్యాపారులు రూ.1900 నుంచి రూ.1950 వరకు ధర చెల్లిస్తుండడంతో రైతులు కోసిన వెంటనే అమ్మేస్తున్నారు.
చాలా చోట్ల రైసు మిల్లర్లు, ప్రయివేటు వ్యాపారులు వరి పొలం వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వర్షాకాలం కావడంతో తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టడం, తాలు పట్టడం, కొనుగోలు కేంద్రానికి ధాన్యం రవాణా చేయడం తదితర ఖర్చులతో పోలిస్తే ప్రయివేటువ్యాపారులు చెల్లించే ధర సముచితంగానే ఉండడంతో రైతులు పెద్ద సంఖ్యలో ధాన్యాన్ని ప్రయివేటులోనే విక్రయిస్తున్నారు.
నవంబరు మూడోవారంలో కొనుగోలు కేంద్రాలు..
– సర్ధార్ రవీందర్‌సింగ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహిస్తాం. ఎన్నికలు, కోడ్‌తో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం కూడా ఇచ్చాం. నవంబరు రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరుస్తాం.