Wednesday, November 20, 2024

మినీ మేడారానికి ముమ్మర ఏర్పాట్లు.. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జాతర

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: మినీ మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతరను నిర్వహించాలని మేడారం ట్రస్టుబోర్డు, పూజారుల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. మినీ జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు. మేడారం జాతరకు ఈ సారి ప్రభుత్వం కూడా నిధుల కేటాయింపు భారీగానే విడుదల చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా 2.82 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ది పనులు జరిపిస్తున్నారు. జాతర ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ రెండు దఫాలుగా పరిశీలించ డంతో పాటు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అలాగే ములుగు జిల్లాకలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఏటూర్‌నాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్‌ పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మినీ జాతరలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్‌, ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆది త్య, ఐటీడీపీఓ అంకిత్‌ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

పిల్ల జాతర్ల జోరు…

ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదివరకు మేడారం మినీ జాతరతో పాటు జిల్లాలోని పిల్ల జాతర్లు ఘనంగా జరగనున్నాయి. మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పూనుగుండ్ల కామారంలో పిల్ల జాతరను ని ర్వహిస్తారు. అదేవిధంగా ఏటూర్‌నాగారం మండలం ఐలాపూర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతరను పెద్దఎత్తున నిర్వహిస్తారు. వెంకటాపూర్‌ మండలంలోని గుర్రంపేటలో సమ్మక్క, సారలమ్మ జాతరను నిర్వహిస్తారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌ నియోజకవర్గంలోని చెల్పూర్‌ మండలం సమ్మక్క, సారలమ్మ జాతరను నిర్వహిస్తారు. హనుమకొండ జి ల్లా ఆత్మకూర్‌ మండలం అగ్రంపహడ్‌లో కూడా సమ్మక్క, సారలమ్మ జాతరను నిర్వహిస్తారు.

- Advertisement -

రూ. 2.82 కోట్లతో మినీ మేడారం ఏర్పాట్లు

మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నుంచి 2.82 కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 30 లక్షలమందికి పైగా భక్తులు వస్తారని అంచనావేసినట్లు అధికారులు తెలిపారు. అందుకనుగుణంగా నిధుల కేటాయింపు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి అవసరాలు, మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి కోసం 22 లక్షల 900రూపాయలను ఖర్చుచేస్తున్నారు. అదేవిధంగా ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో 60 లక్షల 85వేల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. తాగునీటి ఏర్పాట్లు, రోడ్లు, బండ్లదారులను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసేందుకు నీటిపారుదల శాఖ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 11 లక్షల 70 వేల రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.

అదేవిధంగా జాతర సందర్భంగా లోతైన నీటి ప్రాంతాల్లో భక్తులకు సమస్యలు తలెత్తినట్లయితే వారిని రక్షించుకునేందుకు కోసం గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు చీకటిలో ఉండకుండా విద్యుత్‌ వెలుగుల్లో ఉండేందుకు కోసం టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ ఆద్వర్యంలో 42 లక్షల 12వేల రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. అలాగే శానిటేషన్‌ ఏర్పాట్లు,పారిశుద్ద్య సమస్య తలెత్తకుండా జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారి ఆధ్వర్యంలో 200 మంది కార్మికులతో పారిశుద్ద్య పనులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ద్యం కోసం ప్రత్యేకంగా 69 లక్షల 64 వేల రూపాయలను ఖర్చుచేస్తున్నారు. డిపిఆర్‌ఈ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌, అదేవిధంగా చింతల్‌ క్రాస్‌రోడ్డు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఊరట్టం వరకు రోడ్ల మరమ్మత్తులను 15 లక్షల రూపాయల వ్యయంతో చేస్తున్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలోతప్పిపోయిన వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. వీటి కోసం 5 లక్షలను ఖర్చుచేస్తున్నారు. అదేవిధంగా 2022లో సంభవించిన వరదలతో దెబ్బతిన్న రోడ్లకు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో 50లక్షలతో మరమ్మత్తులు, ప్యాచ్‌ వర్కలు చేస్తున్నారు. మొత్తంగా సుమారు 3 కోట్ల రూపాయలను జాతర కోసం ఖర్చుచేస్తున్నారు.

29 నుంచి ప్రత్యేక బస్సులు

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు జనవరి 29 నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 29 నుంచి మూడు రోజుల పాటు భక్తులను బట్టి బస్సులను నడుపుతారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులను అన్నిఏర్పాట్లను చేస్తున్నారు. తెలంగాణతో పాటు చత్తీస్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలనుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు అక్కడి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్టీసీ కన్న ప్రైవేట్‌ వాహనాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు కూడా ఉండాలని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement