అమరావతి, ఆంధ్రప్రభ: మార్కెట్‌లో కందిపప్పు ధర అనూహ్యంగా పెరిగింది. హోల్‌సేల్‌లో రూ.170 ఉంటే రిటైల్ మార్కెట్‌లో రూ.180 వరకు ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే డబుల్ సెంచరీని తాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.100కు విక్రయించిన కందిపప్పు ధరలకు ఏప్రిల్ నుంచి రెక్కలొచ్చాయి. ఆ నెల్లో రూ.110, జూన్‌లో రూ.130కు విక్రయించగా తాజాగా దీని ధర రూ.170 పైనే పలుకుతోంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాల వంటింట్లో పప్పులు కడని పరిస్థితి దాపురించింది.
దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ చేసే విధంగా చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 1.47 లక్షల రైస్ కార్డుదారులు ఉండగా ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసవరం అవుతోంది. అక్టోబర్ నుంచి సబ్సిడీపై కందిపప్పును అందించే విధం గా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర అవసరాల కోసం 50 వేల టన్నుల కందిపప్పు నిల్వలను కేటాయించాలని కేంద్రాన్ని కోరింది.
రాష్ట్రంలోని రైతుల నుంచి నేరుగా కందులను కొనుగోలు చేసి మిల్లింగ్ అనంతరం పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలోపండే చిరుధాన్యాలు , కందులు స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్ధతు ధర అందించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ సమస్య
ఇటీవల కందిపప్పు దిగుమతులకు సంబంధించి కేంద్రం కర్ణాటక గోడౌన్‌లను కేటాయించింది. అయితే ఆ కందుల్లో పుచ్చు, నాసిరకం ఎక్కువ ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసుకోవడానికి నిరాకరించింది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వేరేచోట గోడౌన్‌లు కేటాయించాలని కోరింది. అయితే ఈ ఏడాది కందుల పంట దిగుబడి తక్కువగా ఉన్నందున వాటికి బదులు శనగలు ఇస్తామని కేంద్రం చెెప్పగా ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల అవసరాల దృష్ట్యా కందులు కావాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో దిగి వచ్చిన కేంద్రం ఈ నెలాఖరుకు పంపుతామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. కందిపప్పు సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. వాణిజ్య పంటల్లో దండిగా లాభాలు వస్తుండటంతో అపరాల సాగుపై మక్కువ చూపడం లేదు. ప్రజల డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడం వల్లే ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
నాలుగేళ్ళలో 3 లక్షల టన్నులు పంపిణీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన నాలుగేళ్ళలో మూడు లక్షల టన్నుల కందిపప్పును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు దాదాపు రూ.150 ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.80 సబ్సిడీతో కిలో పప్పు కేవలం రూ.67కే పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.3,019 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ళలో 93 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేయగా వైసీపీ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ పంపిణీ చేసింది.
ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో కొంత కాలంగా రేషన్ ద్వారా పంపిణీని నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అక్టోబర్ నుంచి ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుంచి పేద, మధ్యతరగతి వర్గాలకు కందిపప్పు చౌకగా దొరికే ఛాన్స్ ఉంది.