భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద విషాదం చోటు చేసుకుంది. ఎల్ఓసీకి సమీపంలో భారత్‌కు చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. కో-పైలట్ తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ అధికారులు వివరించారు. ఎల్ఓసీ.. నార్త్ కశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలిన విషయం తెలుసుకున్న పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. గాయపడిన కో-పైలెట్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవని అధికారులు ప్రకటించారు. అయితే హెలికాప్టర్ కూలిన ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉండటంతో.. సహాయక చర్యల కోసం కొంత ఆటంకం కలిగిందని తెలిపారు.
ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్ సెక్టార్‌లోని గజ్రాన్ నల్లాహ్.. లైన్ ఆఫ్ కంట్రోల్‌కు ఎంతో దగ్గర్లో ఉంది. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ కోసం ప్రయత్నించినప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ఓ ఆర్మీ అధికారి వివరించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేవని, వాతావరణం అనుకూలించకపోవడంతో కూలిందా.. లేదైనా ఏమైనా ఉగ్రవాద చర్య ఉందా..? అన్న కోణంలోనూ కేంద్రం ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..