Tuesday, November 26, 2024

మెడికల్‌ కాలేజీల్లో సీనియర్‌ ప్రొఫెసర్లు ఏరీ..? కొత్త కాలేజీల్లో వేధిస్తున్న కొరత..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆకస్మిక తనిఖీలతో అధ్యాపకులు, సదుపాయాలు లేవన్న కారణంగా వైద్య కళాశాలల గుర్తింపును నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ధాక్షిణ్యంగా రద్దు చేస్తున్న తరుణంలో 11 మంది సీనియర్‌ ప్రొఫెసర్‌ , అసిస్టెంట్‌ ప్రొఫెసఱ్‌ స్థాయి సిబ్బందిని తెలంగాణ వైద్య విద్యా విభాగం ఏపీకి పంపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అధ్యాపకులు, సదుపాయాలు సరిగా లేవని తెలంగాణలోని ఎమ్మెన్నార్‌, మహావీర్‌, టీఆర్‌ఆర్‌ ఈ మూడు ప్రయివేటు వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసిన విషయం విధితమే. అదే సమయంలో ప్రస్తుతం తెలంగాణలో జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలను తెలంగాణ వైద్య విద్యా విభాగం (డీఎంఈ) ప్రారంభించనుంది. ఈ తరుణంలో వైద్య విద్యా ఫ్యాకల్టిd అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలల్లో ముందుగా అధ్యాపకులను నియమించాలని ఎన్‌ఎంసీ ఇప్పటికే రెండు, మూడు దఫాలు డీఎంఈ డా. రమేష్‌రెడ్డికి లేఖ రాసింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీలకు అధ్యాపకుల కోసం వైద్య, ఆరోగ్యశాఖ జాతీయస్థాయిలో మూడుసార్లు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయినప్పటికీ అనుకున్నంతస్థాయిలో అధ్యాపకులు దొరకలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి ఎన్‌ఎంసీ తనిఖీలకు వస్తే కొత్త వైద్య కళాశాలలకు అనుమతి వస్తుందా..? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.

ఇలాంటి కీలక సమయంలో తమ ప్రమోషన్లు, అధికారాల ప్రయోజనాల కోసం ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న సాకుతో 11 మంది సీనియర్‌ ప్రొఫెసర్లను తెలంగాణ వైద్య విద్యా విభాగం పంపించేయడం తీవ్ర విమర్శల పాలవుతోంది. కొద్ది రోజుల కిందట ఏపీకి కేటాయించిన 11 మందిలో అందరూ వైద్య విద్యా బోధనలో 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారే కావడం గమనార్హం. కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు నేపథ్యంలో వీరి సేవలను విజ్ఞతతో ఉపయోగించుకోవాల్సిన రాష్ట్ర వైద్య విద్యా విభాగంలోని ఉన్నతాధికారులు… తమ ప్రమోషన్లకు, అధికారానికి అడ్డువస్తారన్న నెపంతో ఉన్నపళంగా ఏపీకి పంపిచేశారన్న ఆరోపణలు దండిగా వినిపిస్తున్నాయి. ఏపీకి కేటాయించిన వైద్య విద్యా ప్రొఫెసర్లకు మైక్రో బయోలజీ, ఫార్మకాలజీ, ఓబీజీ, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పాథాలజీ, పీడియాట్రిక్స్‌, డెర్మటాలజీ వంటి కీలకమైన విభాగాల్లో 30ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ విభాగాల్లో ప్రొఫెసర్లను నియమించాలంటే వీరకంటే అదనంగా రూ.50వేలు చెల్లించి అదీ కాంట్రాక్టు పద్దతిలో నియమించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంత చేసినా… బోధనలో వారికి నైపుణ్యం ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసేందుకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా , ఏ కోణంలో చూసినా సినియర్‌ ప్రొఫెసర్లను ఏపీకి కేటాయిస్తూ తెలంగాణ వైద్య విద్యా విభాగం తీసుకున్న నిర్ణయం అబాసుపాలవుతోంది. కాగా… వైద్య విద్య పూర్తి చేసుకున్న తర్వాత దశాబ్దాల కాలంగా తెలంగాణలోనే పనిచేస్తున్న తమను ఉన్నట్టుండి ఏపీ కేడర్‌కు పంపించడంపై సీనియర్‌ ప్రొఫెసర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వెళితే పదోన్నతులు, మెరుగైన సర్వీసు అవకాశాలు ఉన్నా… తాము తెలంగాణలో పనిచేసేందుకే సిద్ధమయ్యామని చెబుతున్నారు. కమలనాథన్‌ కమిటీ కూడా తమను తెలంగాణకే కేటాయించిందని గుర్తు చేస్తున్నారు.
తదుపరి తనిఖీల సమయానికి లోటుపాట్లను సరిచేసుకుని అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించాలని, లేనిపక్షంలో కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రావడం కష్టమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పందించి కీలకమైన వైద్య విద్యా విభాగాల్లో అనుభవం ఉన్న ప్రొఫెసర్లను ఏపీకి కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వైద్య నిపుణులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement