న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను రాజకీయ వేదికగా మార్చేశారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. తండ్రీ, కొడుకు, అల్లుడు పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శించారని అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మణ్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు ఏం చేయదల్చుకున్నారో చెప్పకుండా, ప్రజా సమస్యలపై చర్చించకుండా ఆవు కథలా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని లక్ష్మణ్ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పరస్పరం ప్రశంసించుకున్నారని, ప్రధాని మోదీని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే బీఆర్ఎస్ నేతలు బల్లలు చరుస్తూ మద్ధతు పలికారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాట నిజమని నిరూపితమైందని డా. లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే కేసీఆర్ చదివారని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడారని, కరోనా అనంతర పరిస్థితులకు తోడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారతదేశం వృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపిారు. నిజానికి దివాళా అంచునున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ కరెంటు కోతలు భరించలేక రైతులు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 11,900 కోట్ల మేర బకాయి పడిందని, ఆ బకాయిలను ఇప్పటికీ తీర్చడం లేదని అన్నారు. దోమకు ఎంత తొండం ఉన్నా అది ఏనుగు కాలేదని, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ కాలేదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడం లేదు?
మరోవైపు బీసీల కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇందుకు చాలా అధ్యయనం అవసరమని, దానికి చాలా సమయం పడుతుందని డా. లక్ష్మణ్ తెలిపారు. కుల గణన గురించి ఆరోపణలు చేస్తున్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎందుకు బీసీల కుల గణన చేపట్టడం లేదో చెప్పాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్‌పై బదులిస్తూ బీసీ వర్గాలకు చెందిన నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రిగా ఉన్నారని, చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు చోటు కల్పించారని, అలాంటప్పుడు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం ఏముందని అన్నారు.