Thursday, November 21, 2024

‘అర్ధశతాబ్ధం’ మూవీ రివ్యూ

రేటింగ్: 2.5/5

లాక్‌డౌన్ వేళ నేరుగా ఓటీటీలో విడుదలైన మరో చిత్రం ‘అర్థ శతాబ్ధం’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ మూవీ విడుదలైంది. సీరియస్‌ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్‌లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే ఈ చిత్రం తెరకెక్కింది.

సిరిసిల‍్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌ రామన్న(సాయికుమార్‌) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని సిరిసిల్ల గ్రామంలో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ గ్రామంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

‘కేరాఫ్‌ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్‌ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్‌ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్‌ రామన్నగా సాయికుమార్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్‌ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్‌ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విప్ల‌వం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చినా.. ఇలాంటి కథలను డీల్‌ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా స‌న్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని త‌ట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్‌ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్య‌వ‌స్థ‌, వ‌ర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బ‌ల‌మైన విష‌యాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది.

- Advertisement -

ఫస్టాఫ్‌ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్‌ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా క‌థ సీరియ‌స్ ట‌ర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవ‌రు ఎవ‌రిని చంపుతున్నారో ఎవ‌రికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్‌), డీఎస్పీ(అజయ్‌) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, నవీన్‌ చంద్ర అజయ్‌, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు.

ఈ మూవీలో అసభ్యపదజాలం, రక్త‌పాతం, హింస మ‌రీ ఎక్కువైంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్‌ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్‌ కుమార్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా మంచి కథ ఉన్నా రొటీన్ కథనంతో సినిమా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. 2003 కాలంలో జరిగే కథ ఇది. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నమైన ప్రయత్నమిది. ఆలోచన బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం తడబాటుకు లోనవ్వడంతో యావరేజ్‌ సినిమాగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement