హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల ఏడాదిలో మరిన్ని సరికొత్త పథకాలు పురుడుపోసుకోనున్నాయని, సీఎం కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రాలు రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని బీసీ కులాల సంక్షేమంతోపాటు గిరిజన, ఆదివాసీలే లక్ష్యంగా త్వరలో విప్లవాత్మక పథకాలు ప్రకటించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే పోడు పట్టాలు పంపిణీకి సిద్ధంకాగా, ఇతర బెనిఫిట్లు అంవదించేలా ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోందని తెలిసింది. ఇదే కోవలో దళితబంధు పథకం తర్వాత నెలకొన్న డిమాండ్ల నేపథ్యంలో బీసీ సంక్షేమం దిశగా సర్కార్ కార్యాచరణ చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. వీలైనంత త్వరలో వెనుకబడిన కులాల ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించేందుకు యోచిస్తున్నారు.
బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ఉన్న అడ్డంకులను దూరం చేయడంతోపాటు ఆయా వర్గాల వారు ఆర్థిక స్వావలంబన సాధించేలా అద్భుత పథకానికి శ్రీకారం చుట్టడంద్వారా కులవృత్తుల పరిరక్షణతోపాటు, జీవనోపాధికి వీలుగా 100 శాతం రాయితీతో నేరుగా సర్కారే వారికి ఆర్ధిక సాయం అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఈ మేరకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ చేసిన ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం రాయితీతో ఈ ఆర్ధిక చేయూత వారికి నేరుగా చేరేలా సరికొత్త పథకం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని సమాచారం.
చిన్న వ్యాపారాలు చేసేవారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో నేరుగా ఆర్థికసాయం అందించాలని, దీనికోసం గ్రామాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాలు రూపొందించాలనిప్రభుత్వ భావనగా ఉంది. ఇందుకు ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరక్టర్ సభ్యులుగా కమిటీని నియమించాలని, లబ్దిదారుల జాబితా తయారు కాగానే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారికి ఈ సాయం అందించాలని, బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకు వినియోగించాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉందని తెలిసింది.రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పెద్ద ఎత్తున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది.
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని బీసీలకు కేటాయించడంతోపాటు, వెనుకబడివర్గాలకు చెందిన కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే కల్లు దుకాణాల పునరుద్ధరణతో పాటు చెట్ల రకం రద్దుతో గీత కార్మికులకు మేలు జరుగుతోండగా, గీత కార్మికులకు తాజాగా గీత బీమాను ప్రకటించింది. మరింత సంక్షేమం కోసం ఇంకా ఏం చేయాలన్న అంశంపై అధ్యయనం చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలుస్తోంది. యాదవులకు ఇప్పటికే లక్షలాది యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా, ఈ పథకంతో యాదవులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని, పెద్ద ఎత్తున చేపల పెంపకంతో ముదిరాజ్, గంగ పుత్రులు తదితర మత్య్సకారులు లాభం పొందుతున్నారని, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యలతో పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. తద్వారా రాష్ట్ర సంపద, జీడిపి మరింత మెరుగైందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇంకా చాలా కులాలు కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయని, అలాంటి వారికి చేయూతనివ్వాల్సి ఉందని, విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలని ప్రభుత్వ భావనగా ఉంది. కులవృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసేవారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునేవారికి, మెకానిక్‌లకు, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలందరికీ ఆర్థిక చేయూతనివ్వాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. రజకులకు దోబీఘాట్లకు ఉచిత విద్యుత్, నాయూ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ అందజేతతో ప్రభుత్వం ఇప్పటికే ఆయా వర్గాలకు భరోసానిచ్చింది. మిగిలన వర్గాలకు మరింత ఊతంగా ఆర్ధిక సాయం అందించి రాష్ట్ర సంపదలో భాగస్వామ్యం చేసేలా సరికొత్త పథకాన్ని సిద్దం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లుగా తెలిసింది.