న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకునే ప్రక్రియ) ప్రక్రియలో న్యాయ వ్యవస్థ జోక్యం తగ్గించి ఆర్బిట్రేషన్ సెంటర్ వీలైనంత స్వయంప్రతిపత్తి కలిగి ఉండేలా చట్టాన్ని రూపొందించాలని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం ద న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సవరణ బిల్లు ద్వారా న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌గా మార్పు చేసే ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. ఇప్పటి వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఆర్బిట్రేషన్‌ను దేశవ్యాప్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఈ సవరణ బిల్లులో పొందుపరచాలంటూ విజయసాయి ప్రభుత్వానికి నాలుగు ముఖ్యమైన సూచనలు చేశారు.
కోర్టుల జోక్యం తగ్గించాలి..
ఆర్బిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టం 1996 ప్రకారం ఆర్బిట్రేటర్ నియామకంపై ఉభయ పక్షాల మధ్య అంగీకారం కుదరనప్పుడు ఆర్బిట్రేటర్‌ను నియమించే అధికారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు ఉంటుందన్న ఆయన, అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతోందని చెప్పారు. ఆర్బిట్రేటర్ నియామకంలో కోర్టులు తీవ్ర జాప్యం చేస్తుండడం వల్ల కక్షిదారులకు లీగల్ ఖర్చులు పెరిగిపోతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) ద్వారా తక్కువ ఖర్చుతో త్వరితగతిన వివాదాలు పరిష్కరించుకోవచ్చన్న అసలు లక్ష్యం మరుగున పడిపోతోందని అన్నారు. అలాగే ఆర్బిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ఆర్బిట్రేటర్‌ను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలకు బదలాయించవచ్చు, కానీ కోర్టులు ఈ అధికారాన్ని ఏనాడూ వినియోగించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. తాత్కాలిక ఆర్బిట్రేషన్‌లలో ఆర్బిట్రేటర్లను నియమించే అధికారం సంపూర్ణంగా ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కలిగి ఉండేలా చూడాలని శ్రీ విజయసాయి ప్రభుత్వానికి సూచించారు. ఆర్బిట్రేషన్‌కు ప్రసిద్ధి చెందిన లండన్, సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాలలో ఇదే మాదిరిగా జరుగుతోందని అన్నారు. దీనివల్ల ఆర్బిట్రేషన్ ప్రక్రియలో న్యాయ వ్యవస్థ జోక్యం తగ్గి ఆర్బిట్రేషన్ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఆర్బిట్రేటర్లుగా రిటైర్డ్ జడ్జిలు వద్దు..
ఆర్బిట్రేషన్ కేసులలో అధిక శాతం రిటైర్డ్ జడ్జిలను ఆర్బిట్రేటర్లుగా నియమించే ట్రెండ్ ఆందోళనకరమైన విషయమని విజయసాయి రెడ్డి అన్నారు. ఆర్బిట్రేటర్ వ్యవస్థలో రిటైర్డ్ జడ్జిల ప్రవేశం వల్ల న్యాయ వ్యవస్థలో ఉండే దీర్ఘకాల వాయిదాల జాఢ్యం ఆర్బిట్రేషన్ ప్రక్రియలోకి చొరబడుతుందని, ఫలితంగా వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ జడ్జిలు ఆర్బిట్రేషన్ ప్రక్రియను కోర్టుల మాదిరిగా నడిపించే ప్రమాదం ఉందని, ‘నేటి చీఫ్ జస్టిస్ రేపటి ఆర్బిట్రేటర్’ అనే నానుడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్బిట్రేషన్‌ను ఒక నైపుణ్యమైన ఉన్నత వృత్తిగా తీర్చిదిద్దాలే గానీ జడ్జిలకు రిటైర్మెంట్ అనంతర అవకాశంగా మలచవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అందుకోసం న్యాయ వృత్తిలో నైపుణ్యం ఉన్న వారితో ఆర్బిట్రేటర్ సమాజం బలపడేలా చూడాలని అన్నారు.
వృత్తి కౌశల్యం కలిగిన వనరుల కొరత..
ఆర్బిట్రేషన్ సెంటర్లు వృత్తి కౌశల్యం కలిగిన వనరుల కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమన్నారు. ఆర్బిట్రేషన్ ప్రక్రియలో సుశిక్షితులైన సిబ్బంది తగినంతగా లేకపోవడం వల్ల ఆర్బిట్రేషన్ ప్రక్రియలో కక్షిదారులకు తగిన తోడ్పాటు లభించడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఆర్బిట్రేషన్, కాన్సిలియేషన్ చట్టంలో కౌన్సెల్స్‌గా నియమితులయ్యే వారికి ఆర్బిట్రేషన్‌లో తప్పనిసరిగా అనుభవం ఉండాలన్న నిబంధనే లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ దశలోనే అర్హులైన నిపుణులు మాత్రమే ఆర్బిట్రేషన్ సెంటర్‌లో పని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
సింగపూర్, హాంకాంగ్ నుంచి నేర్చుకోవాలి..
ఆర్బిట్రేషన్‌లో ప్రసిద్ధి చెందిన సింగపూర్, హాంంకాంగ్‌లను చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆర్బిట్రేషన్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు, కల్పిస్తున్న మౌలిక వసతులు అసాధారణమని వివరించారు. అదే మన దేశంలో చూస్తే ఆర్బిట్రేషన్ సెంటర్‌కు 2021-22లో ప్రభుత్వం కోటి రూపాయలు, 2022-23లో 3 కోట్లు కేటాయించిందని అన్నారు. కాబట్టి ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ప్రభుత్వం ఉదారంగా ఆర్థిక వనరులను కేటాయించి దానిని పరిపుష్టం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈ బిల్లు ద్వారా దేశంలో స్నేహపూరితమైన ఆర్బిట్రేషన్ వాతావరణం నెలకొల్పుతున్నట్లు అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన సందేశం పంపిచింనట్లవుతుందంటూ ఆయన ఈ బిల్లును స్వాగతిస్తూ మద్ధతు ప్రకటించారు.