హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రయివేటు మెడికల్ షాపులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ(ఔట్ పేషెంట్), ఐపీ (ఇన్‌పేషెంట్) రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నపుడు ప్రయివేటు మెడికల్ షాపుల అవసరం ఏంటి..? అని పలుమార్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులను నిలదీ స్తున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల్లో కదలిక కనిపించడం లేదు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగాణాల్లోనో, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి అత్యంత సమీపంలో ప్రయివేటు మెడికల్ షాపులు తమ వ్యాపారాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యులే నేరుగా రోగులకు బ్రాండెడ్ పేరుతో ప్రయివేటు మెడికల్ షాపులకు మందులు రాస్తుండడంతో వారి వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలోని ప్రయివేటు మెడికల్ షాపుల యజమాన్యాలు ప్రతి రోజూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నాయి. మెడికల్ షాపులతో ప్రభుత్వ వైద్యులు కుమ్మక్కై పేద, సామాన్య రోగులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. రోగులకు అవసరమైన మందులన్నింటినీ టీఎస్ఎంఐడీసీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. అయినప్పటికీ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి స్టోర్‌లో లేని మందులను రోగులకు రాస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ప్రయివేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు.
ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే తిరుమల మెడికల్ స్టోర్ దశాబ్దన్నరంపైగా కొనసాగుతోంది. ఈ షాపుతోపాటు మరో రెండు ప్రయివేటు మెడికల్ షాపులు గాంధీ ఆవరణలో కొనసాగుతున్నాయి. గాంధీ మాదిరిగా నిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ప్రయివేటు మెడికల్‌షాపులు కొనసాగుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించి… తమ వ్యాపారాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందలు కొరత…
- తెలంగాణ హెల్త్ రిఫామ్స్ అసోసియేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా రకాల ఔషధాలు అందుబాటులో లేవని తెలంగాణ హెల్త్ రిఫామ్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. ప్రయివేటుకు మందులు రాస్తున్నారన్న నెపంతో వైద్యులపై చర్యలు తీసుకోవడం కాదని, ముందుగా ఆసుపత్రులకు మందుల సరఫరానుమెరుగు పరచాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. మహేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్తితుల్లో అందించాల్సిన మందులు కూడా కొవిడ్ నోడల్ ఆసుపత్రి అయిన గాంధీలో అందుబాటులో లేవని , ఫలితంగా ప్రయివేటు మెడికల్ షాపుల వ్యాపారం జోరుగా సాగుతోందంటున్నారు. వరంగల్ ఎంజీఎం, నిమ్స్ ఆసుపత్రిలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పేద, సామాన్య రోగులపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ప్రయివేటు మెడికల్ షాపులను ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణ నుంచి ఖాళీ చేయించాలని వైద్య, ఆరోగ్యశాఖను డిమాండ్ చేశారు. జనరల్ సర్జరీ, నాజల్ డ్రాప్స్, ఎనర్జీ డ్రింక్స్, డిస్పోజబుల్స్ తదితర ఔషధాలు పెద్ద సంఖ్యలో అందుబాటులేవని మందుల తాలూకు జాబితాను కూడా పొందుపరిచారు. టీఎస్ఎంఐడీసీలోని అవినీతి అధికారులకు చెక్‌పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా చైన్‌ను సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.