ఏపీ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు కూడా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆంధ్రా ఊటీ అరకులోయలో పర్యటించేందుకు పర్యటకులకు తిరిగి అనుమతిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. కరోనా 2వ దశ వ్యాప్తితో అరకు పరిసర ప్రాంతాల్లో పర్యటక కేంద్రాలు పూర్తిగా మూతపడిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి ఈ ప్రాంతాల్లో సందర్శకులను అనుమతించనున్నట్లు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. పెదలబుడు సమీపంలోని గిరి గ్రామదర్శిని, చాపరాయి, కొత్తపల్లి జలపాతాలు, తాజంగి, లంబసింగి తదితర ప్రాంతాలకు పర్యటకులను మునుపటిలానే అనుమతిస్తున్నట్లు చెప్పారు.
అంతేకాకుండా ఇకపై అరకులోయ సందర్శనకు వచ్చే పర్యటకుల కోసం గిరిజన మ్యూజియంలో కొత్తగా ప్రతిమలు ఏర్పాటు చేసినట్లు మ్యూజియం మేనేజర్ మురళి తెలిపారు. ఇవి పర్యటకులను బాగా అలరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మ్యూజియంలో ఈ మధ్యనే గ్యాలరీని ఏర్పాటు చేశామని, గిరిజన సంప్రదాయ, ఆచారాలను తెలియజేసేలా గ్యాలరీలను రూపొందించామని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మంగళవారం నుంచి మ్యూజియంలోనికి పర్యటకులను అనుమతిస్తున్నట్లు మురళి పేర్కొన్నారు.