హైదరాబాద్: ఆంధ్రప్రభ: శతబ్దాల తరబడి జీెవనాధారంగా ఉన్న చెరువులు మిషన్ కాకతీయతో పునరుద్ధరణ జరగడంతో భారీవర్షాలను తట్టుకుని గతచరిత్ర వైభవాన్ని చాటుతున్నాయి. సమైక్యపాలనలో వర్షాలుకురిస్తే చెరువులు గండి పడి గ్రామాలు నీటమునిగిన విషాద సంఘటనల నుంచి క్రమేణ రాష్ట్రం కోలుకుంది. గోలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో ప్రస్తుతం కురుస్తున్న 650 సెంటిమీటర్ల భారీవర్షానికి చెక్కుచెదరక నిలిచి ఉనాయి. వేలాది చెరువుల్లో కేవలం 240 చెరువులకు గండిపడగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పునరుద్ధరిస్తున్న చరిత్ర కేవలం తెలంగాణకే దక్కుతోంది.
తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం 2010లో 4వేల 251, 2011లో 393, 2012లో 659, 2013లో 1868, 2014లో 365 లకు గండి పడగా ప్రస్తుతం కేవలం 240 చెరువులకు మాత్రమే గండిపడటం గమనిస్తే మిషన్ కాకతీయతో 12వేల గొలుసుకట్టు చెరువులతో పాటుగా వేలాది చెరువులు పదిలమై జలకళ సంతరించుకోవడంతో రెండు పంటలకు సాగునీరు అందించేందుకు సిద్ధమయ్యాయి. మిషన్ కాకతీయలో 5 నుంచి 10వేల ఎకరాల ఆయకట్టు సామర్ధ్యం కలిగిన 27వేల 627 చెరువులను రూ. 9,155 కోట్ల తో పునరుద్ధరించడంతో భారీ వర్షాలను తట్టుకుని పూర్తి స్థాయి నీటి మట్టంతో జల కళ సంతరించుకున్నాయి.
అలాగే వివిధ దశల్లో 46వేల 531 చెరువుల పునరుద్ధరణతో తెలంగాణ లోపూర్వకాకతీయ స్వర్ణయుగం పునరావృతం అయింది. భారీవర్షాలతో వాగులు,వంకలు ఏకమై ప్రవహించినా మిషన్ కాకతీయలో పునరుద్ధరించిన చెరువులు చెక్కుచెదరలేదు. కాకతీయ సామాజ్రంలో లక్షా 50 వేల గొలుసుకట్టుచెరువులు, కుంటలు, ఊట చెరువులు ప్రధాన జలాశయాలకు అనుబంధంగా ఉండగా 1956 నాటికి కేవలం 70 వేల చెరువులు మిగిలాయి. పట్టణీకరణ తో పాటుగా , భూబకాసూరుల దాహానికి బలికాగా తెలంగాణ ఆవిర్భవించే నాటికి 46వేల 531 చెరువులు మిగిలాయి. ఇందులో 12వేల గొలుసుకట్టు చెరువులున్నాయి.
ఈ చెరువులను దశలవారిగా పునరుద్ధరించడంతో ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుత భారీ వర్షాల్లో చరిత్రాత్మకమైన భద్రకాళి చెరువుతో పాటుగా 239 చెరువులు,కుంటలకు గండ్లు పడ్డాయి. అయితే ఇరిగేషన్ డిపార్టు మెంట్ పరిధిలోని ఆపరేషన్ అండ్ మేనేజ్ మెంట్ శాఖ గండి పడిన చెరువుల పునరుద్దరణలో నిమగ్నం కావడంతో ప్రజలకునష్టం వాటిల్లలేదు. గండ్లు పడ్డా ప్రాణనష్టం జరగపోవడం గమనార్హం. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మహాబూబ్ నగర్ లో 7,941, కరీంనగర్ లో 5,480, వరంగల్ లో 5,839, ఖమ్మంలో 4,517, నిజమాబాద్ లో 3,2,851, రంగారెడ్డి జిల్లాలో 2,851 చెరువులు ఉన్నాయి.
ఈ చెరువుల ద్వారా తెలంగాణకు దాదాపుగా 250 టీఎంసీల నీరు లభించడంతో పాటుగా భూగర్భజలాలు సగటున 4నుంచి 5 మీటర్ల కు చేరుకోవడంతో రెండు పంటలకు పుష్కలమైన జలవనరులు సిద్ధమయ్యాయి. ఈ చెరువుల్లో 10 శాతం చెరువుల్లో 25నుంచి 50 శాతం నీరుచేరుకోగా మిగతా చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీరు చేరుకుంది. 3వేల 192 చెరువులు మత్తడి దూకుతున్నాయి.
సత్వర చర్యలు చేపట్టాం..
రాష్ట్రంలోని 46వేల 531 చెరువుల్లో కేవలం 240ుంటలకు గండిపడితే తక్షణ మరమ్మతులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఈఎన్ సీ ఓ అండ్ ఎం.నాగేందర్ రావు తెలిపారు. చెరువుల గండీ తో నష్టం వాటిల్లలేదన్నారు. 650 భారీ సెం.మీ. వర్షాపాతం నమోదు అయినప్పటికీ నిరంతర ఇంజనీర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చర్యలు చెపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. మరమ్మతులకు నిధుల కొరతలేదనీ, ఈఈ, సీఈ, ఈ ఎన్సీ, ఇంజనీర్ల పరిధిలో మరమ్మతులకోసం నిధుల కేటాయింపులు ఉన్నాయన్నారు.
మిషన్ కాకతీయ లో చెరువుల పునరుద్ధరణ జరగడంతో వ్యసాయానికి చెరువులు అందుబాటులోకి రావడంతో పాటుగా ఆయకట్టు స్థిరీకరణ జరిగందన్నారు. సమైఖ్యపానలో వేలాది చెరువులకు గండ్లు పడి ప్రజాజీవితం అతాలకుతలమైతే ప్రస్తుత భారీ వర్షాలతో కేవలం 240 కుంటలకు మాత్రమే గండ్లు పడగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని నాగేందర్ రావు చెప్పారు.