న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ను కలిశారు. శుక్రవారం గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, శనివారం ఉదయం ఢిల్లీ చేరుకుని మర్యాదపూర్వకంగా తొలుత రాష్ట్రపతిని కలిశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
బాధ్యతలు చేపట్టిన వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆయన, ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవనున్నారు. మధ్యాహ్నం గం. 12.40 నుంచి గం. 1.00 సమయంలో ప్రధాన మంత్రిని ఆయన నివాసంలోనే కలవనున్నారు. సాయంత్రం గం. 6.15కు అమిత్ షా తో భేటీ కానున్నారు. ఆదివారం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగుప్రయాణం కానున్నారు.