న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పు శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం లోక్‌సభలో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విడివిడిగా ఇచ్చిన సమాధానాల్లో కేంద్రం ఈ విషయం వెల్లడించింది. నర్సాపురం ఎంపీ కే. రఘురామకృష్ణ రాజు లేవనెత్తిన ప్రశ్నను సోమవారం సభలో లేవనెత్తే అవకాశం ఉన్నప్పటికీ సభ సజావుగా జరగకపోవడంతో ఆ ప్రశ్న – సమాధానం పేపర్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఏవైనా అంచనాలు రూపొందించిందా అని రఘురామ ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (FRBM)యాక్ట్” ప్రకారం ఆర్థిక స్థిరత్వం, రుణాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను అమలు చేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 293(3) అధికరణం ప్రకారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రుణాలు తీసుకోవడం, రుణ పరమితి విధించడం జరుగుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం జరిపి రూపొందించిన “ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2022-23” ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు 2023 మార్చి నెలాఖరు నాటికి రూ. 4,42,442 కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2019 నాటికి రాష్ట్రం మొత్తం అప్పు రూ. 2,64,451 కోట్లుగా ఉందని వివరించారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో రాష్ట్ర ప్రభుత్వ రుణాల వాటా ఎంత అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ గణాంకాలు విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు వాటా 32.95 శాతంగా ఉందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పు వాటా 31.24 శాతంగా ఉందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 34.33 శాతంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మొదటి ఏడాది చూస్తే అది 28.33 శాతంగా ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు పన్నుల్లో వాటాగా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో, రుణాల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి అందిన నిధుల వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది.