న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అప్పులు చేస్తోందన్న భ్రమ కల్పించేలా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా దుష్ప్రచారానికి తెగబడ్డాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, రాష్ట్ర రుణ పరిస్థితిపై గణాంకాలతో సహా పొరుగురాష్ట్రాల పరిస్థితితో పోలిక తీసుకొస్తూ వివరాలు వెల్లడించారు. ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతోనే అప్పులపై తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. పనిగట్టుకుని బురదజల్లుతున్నారని మండిపడ్డారు. నిజానికి 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పులు ఎక్కువగా చేశారని, అందులో అనవసర అప్పులే ఎక్కువగా ఉన్నాయని బుగ్గన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనూ అప్పులు చేశామని అంగీకరిస్తూ.. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చితే తాము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ హయాంలో 8.08 శాతం వడ్డీకి అప్పులు తెస్తే.. తాము 7 శాతం వడ్డీకే తెచ్చామని తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో పొరుగునే ఉన్న తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ కూడా ఉన్నాయని వెల్లడించారు. పార్లమెంటులో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలోనే ఈ గణాంకాలన్నీ సవివరంగా ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు పెరుగుతుంటే, తమిళనాడులో అది ఏడాదికి సగటున రూ. 1 లక్ష కోట్ల మేర ఉందని అన్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో సగటున ఏడాదికి రూ. 45 వేల కోట్లు అప్పు పెరుగుతోందని వెల్లడించారు. కేరళ, కర్నాటక, తమిళనాడుతో పోల్చితే ఏపీ అప్పులు చాలా తక్కువేనని అన్నారు. అలాగే పరిమితికి మించి ఏపీ అప్పులు చేయలేదని బుగ్గన తెలిపారు. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు తక్కువేనని చెప్పారు. స్థూల ఉత్పత్తితో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? అంటూ తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. నిజానికి తమ హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువేనని ఆయనన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగిందని పోల్చి చెప్పారు. ద్రవ్యలోటు 2014లో 3.95% ఉంటే, 2021-22 నాటికి తాము దాన్ని 3% కి తగ్గించామని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు ఉందని, పొరుగునే ఉన్న తెలంగాణలో 4.13 శాతం ఉందని వెల్లడించారు. ద్రవ్యలోటు విషయంలో కూడా ఇతర రాష్ట్రాల కంటే ఏపీ పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చుతూ విషప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం పరిస్థితుల కారణంగా యావద్దేశ అప్పుల శాతం పెరిగిందని అన్నారు. నిజానికి ఏ సంక్షోభం లేకపోయినా తెలుగుదేశం పార్టీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశారని ఆరోపించారు.
వారికి పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు కాదు
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే ముఖ్యమంత్రి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. “తమిళనాడులో ఎవరు అధికారంలో ఉన్నా సరే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒకతాటిపైకి వచ్చి పోరాడి సాధించుకుంటారు. ఏపీలో మాత్రం పూర్తిగా భిన్నం. రాష్ట్రానికి ఏదీ రావొద్దు.. చివరకు అప్పు కూడా దొరక్కుండా చేయాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. అప్పుడే తమ హయాంలోనే రాష్ట్రం బాగుంది అనే భావన జనంలో కలుగుతుంది. రాజకీయంగా తమకు లబ్ది జరుగుతుంది. ఇదీ తెలుగుదేశం వ్యవహారశైలి” అంటూ బుగ్గన మండిపడ్డారు. పైగా తాము చేయని పనులకు సైతం గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. నిజానికి హైటెక్ సిటీకి పునాదులు వేసింది నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అయితే ప్రచారం చేసుకున్నది చంద్రబాబు నాయుడని అన్నారు. సత్య నాదేళ్లకు కంప్యూటర్ నేర్పింది తానేనని, సింధుకు బ్యాడ్మింటన్, సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ తానే నేర్పానని గొప్పులు చెప్పుకునే రకమని ఎద్దేవా చేశారు.
బాబు హయాంలో ఐటీకి లాభం కంటే నష్టమే ఎక్కువ
చంద్రబాబు నాయుడు వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగంలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని బుగ్గన ఆరోపించారు. హైటెక్ సిటీని రియల్ ఎస్టేట్ గ్రూపు చేతిలో పెట్టారని, దాంతో కర్నాటకతో పోల్చితే వెనుకబడ్డామని అన్నారు. ప్రస్తుతం భారత్ నుంచి జరుగుతున్న ఐటీ రంగ ఎగుమతుల్లో కర్నాటక వాటా 40 శాతం వరకు ఉంటే, తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతమే ఉందని, నిజానికి ఆ సమయంలో కర్నాటకలో అధికారంలో ఉన్నవారికి పెద్దగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా లేదని బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ నాటి ఆంధ్రప్రదేశ్ కంటే కర్నాటక రాష్ట్రం కంప్యూటరీకరణలో చాలా ముందంజలో ఉందని గుర్తుచేశారు. ఆయనేది చేసినా అనుకూల మీడియా గొప్పగా చిత్రీకరించేదని, తామెంత మంచి చేసినా సరే తప్పుగా చిత్రీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.