హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న శాసనసభా ఎన్నికల్లో ఎన్నికల సంఘం అనేక సాంకేతికలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓటింగ్ శాతం పెంపు, పారదర్శక ఎన్నికలు, ఓటర్లకు సులువైన మార్గాలతో ఈసీ అనేక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందుకుగానూ అరచేతిలో ప్రపంచాన్ని చూపే సాంకేతికతను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది ఎన్నికల సంఘం. సాంకేతిక మొబైల్ యాప్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మకంగా వినియోగంలోకి తెచ్చింది.
ఓటర్ ఫ్రెండ్లీగా ఉంటూనే దివ్యాంగులు మొదలు, మహిళలు, సాఫ్టవేర్ నిపుణులను ఓటింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్న ప్రయత్నాలు అత్యంత ఫలప్రవం చేసేలా యోచిస్తోంది. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేయాలంటే అక్షరాస్యులకు కూడా అనేక సమస్యలెదురయ్యేవి. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఉల్లంఘనలకు అడ్డులేకుండా పోయే పరిస్థితులు గతమే.. ఇప్పుడు వీటికి సీ విజిల్ యాప్‌తో ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో మొబైల్ యాప్‌ల వినియోగం అధికారికంగా పెరిగింది. పారదర్శక, ప్రశాంత ఎన్నికలను సజావుగా నిర్వహించే లక్ష్యంతో ఓటర్లు, సిబ్బంది, దివ్యాంగులు ఈసీ తన సేవలను యాప్‌ల ద్వారా అందిస్తోంది. వీటన్నింటినీ ప్లే స్టోర్ లేదా యాప్స్.ఎంజీవోవి.ఇన్ వెబ్‌సైట్‌నుంచి లాగిన్ అయ్యాక డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసీఐ.ఎన్‌ఐసీ.ఇన్, ఎన్‌విఎస్‌పి.ఇన్ పోర్టల్‌లు కూడా అనేక సేవలను అందిస్తున్నాయి,
సమాధాన్…
ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫోటోలు, వీడియోలు ఆధారంగా పంపొచ్చు. తర్వాత అధికారులు తీసుకున్న చర్యల కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు.
సువిధ…
సభలు, సమావేశాలు, ర్యాలీలకు అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు ఈ యాప్ ద్వారా అనుమతులు కోరవచ్చు. వాహనాలు, లౌడ్ స్పీకర్లు, పార్టీ కార్యాలయాలు, హెలీకాఫ్టర్ల వినియోగం, తదితర అంశాలకు సరైన పత్రాలిచ్చి ఆన్‌లైన్‌లో ఏకీకృత అనుమతులు పొందొచ్చు. తనకొచ్చిన 24 గంటల్లోగా ఈసీ పరిష్కారం చూపుతుంది.
ఎలక్టోరల్ సెర్చ్…
ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుఉ ఇది ఉపయోగపడుతుంది. తమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాన్ని, మ్యాప్‌ను, రూట్‌ను తెలుసుకునే వెసులుబాటుంది.
సుగమ్…
ఎన్నికల నిర్వహణలో వినియోగించే ప్రైవేటు వాహన వ్యవహారాలు పర్యవేక్షణకు ఆ యాప్ కీలకంగా పనిచేస్తోంది. వాహన యజమానాలు, డ్రైవర్లు,వారికి చెల్లింపుల వివరాలు ఇందులో ప్రత్యక్షమవుతాయి.
మైజీహెచ్‌ఎంసీ…
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ యాప్‌ను డెవలప్ చేసింది. ఓటరుకు తన పోలింగ్ కేంద్రం తెలపడంతోపాటు, మొబైల్‌లో రూట్ చూపిస్తుంది.
ఈసీఐ.సిటిజన్ సర్వీసెస్. ఈసీఐ.ఇన్…
సమస్య తీవ్రతను బట్టీ రిటర్నింగ్ అధికారి స్థాయి అధికారినుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్ వరకు ఎవరికైనా ఫిర్యాదులు ఇందులో నేరుగా చేయొచ్చు. నామినేషన్లు మొదలైన తర్వాత ఈ యాప్ మరింత వేగంగా పయనిస్తోంది. వచ్చిన పిర్యాదులపై జిల్లా రిటర్నింగ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు. దీంతో అత్యద్భుత ఫలితాలొస్తున్నాయి.
ఫిర్యాదుకు…
-ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవాళ్లు ప్లే స్టోర్‌లో సీ విజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
-నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే యాప్‌లోకి వెళ్లి ఫోటో లేదా వీడియో తీసి అప్‌లోడ్ చేయాలి.
-అప్పుడే తీసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసేందుకు వీలుంది. పాతవాటిని అవకాశం లేకపోవడం గమనార్హం.
-ఫోటో, వీడియో ఏదైనా తీసిన ఐదు నిమిషాల్లోపే అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అవకాశం ఉండదు.
ఫిర్యాదులు జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్‌కు చేరుతాయి. అక్కడ నిత్యం వీటిని పర్యవేక్షించే బృందం అప్రమత్తంగా ఉంటుంది.
-ఫిర్యాదు అందిన వెంటనే 15 నిమిషాల్లోగా సంఘటనా స్థలానికి ఎన్నికల బృందాలు వెళ్లి రిటర్నింగ్ అధికారికి నివేదిక ఇవ్వాలి.
-ఈ నివేదిక ఆధారంగా ఉల్లంఘునులపై చర్యలుంటాయి.
స్పందన…
-ఫిర్యాదు అందిన 15 నిమిషాల్లో బృందం ఫీల్డ్‌కు వెళ్లి విచారణ చేస్తుంది.
-30 నిమిషాల్లో నిబంధనల ఉల్లంఘనలపై రిటర్నింగ్ అధికారికి నివేదిక.
-100 నిమిషాల్లో ఘటనపై తీసుకున్న చర్యలతో కూడిన వివరాలతో ఫిర్యాదుదారుడికి సమాచారం చేరుతుంది.