దేశీయంగా టీసీఎస్- సిడాట్ అభివృద్ధి చేసిన 5జీ టెక్నాలజీకి ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం అభిస్తుందని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన ఉత్పత్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆ నమ్మకాన్ని మన టెక్నాలజీ ఇస్తుందని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశ వ్యాప్తంగా లక్షా 25 వేల మొబైల్ బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సైట్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, దీన్ని తీర్చేందుకు త్వరలోనే పూర్తి దేశీయ టెక్నాలజీతో తయారు చేసే సెమీకండక్టర్ల యూనిట్ ప్రారంభం కానుంద ని, దీనికి కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మన సొంత 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.
నమ్మకమైన, నాణ్యమైన సెమీ కండక్టర్ల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందని, వీటిని మన దేశం నుంచే అందిస్తామని ఆయన చెప్పారు. డిజిటల్ సర్వీసెస్‌లో టెలికం ఒక ప్రధాన భాగంగా ఉందని, అందుకే దేశీయంగానే సెమీకండక్టర్లను తయారు చేయాలని నిర్ణయించామన్నారు. నమ్మకమైన ఉత్పత్తులను ఒక్క ఇండియా మాత్రమే అందించగలదని, ఈ విషయంలో ఏ దేశం మనకు పోటీ కాదన్నారు. అమెరికా, యూరోపియన్‌లో చాలా దేశాలు చైనా 5జీ టెక్నాలజీని బ్లాక్ చేశాయని చెప్పారు. మన దేశం ఈ చిప్స్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇవి మన దేశంలో ఉన్న టెలికం నెట్‌వర్క్‌లతో పాటు, ప్రపంచం వ్యాప్తంగా వీటిని అందిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.