Friday, November 22, 2024

ఏపీలో 5 సోలార్ పార్కులకు ఆమోదం.. వైసీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 సోలార్ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ గురువారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఐదు పార్కుల్లో 1,400 మెగావాట్ల సామర్థ్యం కల్గిన అనంతపురం-1 సోలార్ పార్క్ పూర్తైందని, పూర్తి సామర్థ్యంలో విద్యుదుత్పత్తి జరుగుతోందని తెలిపారు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో కర్నూల్ సోలార్ పార్క్ కూడా పూర్తై, విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు.

వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం జరుపుకుంటున్న కడప సోలార్ పార్కులో ఇప్పటికే 250 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల అనంతపురం-2 సోలార్ పార్కులో 400 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని, 200 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ హైబ్రిడ్ పార్కు నిర్మాణం జరుగుతోందని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. మొత్తం 4,100 మెగావాట్ల సోలార్ పార్కులకు 3,050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని ఆయన వివరించారు. నిర్మాణంలో ఉన్న పార్కులను పూర్తి చేయడం కోసం 2024 వరకు సోలార్ పార్క్ స్కీమ్‌ను కేంద్రం పొడిగించిందని ఆర్కే సింగ్ బదులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement