Monday, November 18, 2024

జులై-సెప్టెంబర్‌లో నియామకాలు పెరిగే అవకాశం

దేశీయంగా వర్కర్స్‌ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే నివేదిక తెలిపింది. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో నియామకాలు బాగుంటాయని ఐటీ రంగంలోనూ మెరుగ్గా ఉంటాయని తెలిపింది. సుమారు 3,020 సంస్థల నుంచి వివరాల ప్రకారం 2023లో మూడో త్రైమాసికం లో నియామకాలు బాగుంటాయన్న అంచనాకు వచ్చినట్లు తెలిపింది. లేఆఫ్‌లు జరుగుతున్నా, అంతర్జాతీయంగా ఆర్ధిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ కొత్త ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని ఈ సర్వే అభిప్రాయపడింది.

సర్వేలో పాల్గొన్న వాటిలో 49 శాతం సంస్థలు నియామకాలపై అధిక ఆసక్తి చూపుతున్నాయి. 13 శాతం సంస్థలు నియామకాలకు ఆసక్తి చూపించలేదు. దీంతో నికర ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ 36 శాతంగా ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో నియామక సెంటిమెంట్‌ 15 శాతం క్షీణించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోల్చినా నియామకాలు పెరుగుతాయని తెలిపింది. అంతర్జాతీయంగా 41 దేశాల్లోని కంపెనీల యాజమాన్యాలు నికర సానుకూల నియామక అంచనాను ప్రకటించాయి.. ఇందులో కోస్టారికా అత్యధికంగా 43 శాతం నికర ఉద్యోగ అవుట్‌లుక్‌ను ప్రకటించింది.

- Advertisement -

దీని తరువాత నెదర్లాండ్స్‌ 39 శాతం, పెరు 38 శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉంటే, మన దేశం 36 శాతంతో 5వ స్థానంలో ఉంది. జపాన్‌ 14 శాతం, తైవాన్‌ 15 శాతం అత్యంత జాగ్రత్తతో కూడి ధృక్పథాన్ని ప్రకటించాయి. 84 శాతం భారతీయ సంస్థలు పర్యావరణ హిత ఉద్యోగాలను ఆఫర్‌ చేస్తున్నాయి. వాతావారణ మార్పులు, సంబంధిత పర్యావరణ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి.

రంగాల వారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికాం, కమ్యూనికేషన్స్‌, మీడియాలో 47 శాతం నియామక అవుట్‌లుక్‌ ఉంది. ఇందులో 89 శాతం ప్రస్తుతం గ్రీన్‌ జాబ్స్‌ నియామకాలకు మొగ్గు చూపుతున్నాయి. ఆర్ధిక స్థిరాస్తి రంగాల్లో 41 శాతం నియామక అవుట్‌లుక్‌ ఉండగా, ఇందులో 85 శాతం గ్రీన్‌ జాబ్‌ నియామకాలే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement