న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి రోజ్‌గార్ మేళాలో భాగంగా సుమారు 70 వేల మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (నేడు) నియామకపత్రాలు అందజేయనున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఉదయం గం. 10.30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేసిన అనంతరం ప్రధాని కొత్తగా ఉద్యోగాల్లో చేరనున్నవారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఖాళీలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దేశవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తున్నారు.
ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం – కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రైల్వేలు, ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖ తదితర వివిధ విభాగాల్లో తాజా నియామకాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉద్యోగ కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రోజ్‌గార్ మేళాలను ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది.
నియామక పత్రాలు అందుకున్నవారు తమంతట తాముగా శిక్షణ పొందేలా ‘కర్మయోగి ప్రారంభ్’ పేరుతో ఆన్లైన్ మాడ్యూల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇది ఐజిఒటి కర్మయోగి (iGOT Karmayogi) పోర్టల్ ద్వారా 400కు పైచిలుకు ఈ-లెర్నింగ్ పాఠ్యక్రమాలను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.