న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ నాయకత్వం తలపెట్టిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’కు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండేలా కాంగ్రెస్ నాయకత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహంతోపాటు ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించడం కోసం ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ నిర్వహించాలని తలపెట్టింది.
ఈ కార్యక్రమం క్రింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ సూచించిన మేరకు ఆయా పీసీసీలు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం పరిశీలకులను నియమిస్తూ మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట ఒక ప్రకటన జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడిగా నల్గొండ ఎంపీ, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. తెలంగాణ రాష్ట్ర పరిశీలకుడిగా గోవా పీసీసీ మాజీ చీఫ్ గిరీశ్ చోడాంకర్‌ను నియమించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు సాకె శైలజానాథ్‌కు గోవా బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర పరిశీలకుడిగా కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజును నియమించగా.. పుదుచ్ఛేరి పరిశీలకుడిగా మాజీ ఎంపీ వి. హనుమంతరావును నియమించింది.