హైదరాబాద్, ఆంధ్రప్రభ: సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) నిర్వహణకు తెలంగాణలో మరిన్ని పరీక్షా కేంద్రాలను పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. తెలంగాణలో సీటెట్‌కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ ఈ ఆరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. సీటెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉండగా రాష్ట్రంలో కేటాయించిన ఆరు జిల్లాల పరీక్షా కేంద్రాలు బ్లాక్ అయినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.
30 వేల అభ్యర్థులకు సరిపడా పరీక్ష కేంద్రాలను తెలంగాణలో కేటాయించగా శుక్రవారమే అన్ని జిల్లాలు బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. దాంతో పక్క రాష్ట్రానికి వెళ్లి పరీక్ష రాయాలంటే ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష కేంద్రాలు బ్లాక్ కావడంతో పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు తమ ఆలోచనను విరమించుకుంటున్నారు. తెలంగాణలో మరిన్ని కేంద్రాలు కేటాయించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కోరారు.