హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్(గుర్తింపు)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇంటర్ బోర్డు ఇవ్వాల (సోమవారం) విడుదల చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ కళాశాలల గుర్తింపుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు. 25నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
మండల పరిధిలోని కాలేజీల షిఫ్టింగ్‌కు కూడా అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుల అప్‌లోడింగ్‌కు ఫిబ్రవరి 21 వరకు గడువిచ్చారు. రూ.20వేల అపరాధ రుసుముతో మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను ఏప్రిల్ 30వ తేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. సంబంధిత ధృవపత్రాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.